‘అమ్మ’లకు అక్షర పరీక్ష | - | Sakshi
Sakshi News home page

‘అమ్మ’లకు అక్షర పరీక్ష

Mar 30 2026 7:29 AM | Updated on Mar 30 2026 7:29 AM

● డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహణ ● ‘ఉల్లాస్‌’లో పరీక్షలు రాసిన 12,856 మంది మహిళలు

● డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహణ ● ‘ఉల్లాస్‌’లో పరీక్షలు రాసిన 12,856 మంది మహిళలు

సిరిసిల్ల: కొడవళ్లు పట్టిన.. బీడీలు చుట్టిన.. ఉపాధిహామీ పనిలో పలుగు, పారలు, తట్టా బుట్టలు పట్టిన చేతులు ఆదివారం అక్షరాలు రాశాయి. సామాజిక చైతన్యంతో బుద్ధిమాటలు చెప్పిన ‘అమ్మ’లు చిన్నపిల్లల్లా మారి అక్షరాలు రాస్తూ మురిసిపోయారు. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 12,856 మంది అమ్మలు.. అక్కలు.. అక్షరాలు రాసి తమ అక్షర చైతన్యం చాటారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం వయోజన నిరక్షరాస్య మహిళలు ‘ఉల్లాస్‌’లో పరీక్షలు రాశారు. జిల్లాలో డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 23,375 మంది నిరక్షరాస్యులైన మహిళలకు అక్షరాలు నేర్పించేందుకు ‘ఉల్లాస్‌’లో మూడు నెలల క్రితం పుస్తకాలు అందించారు. వారు నేర్చుకున్న అక్షరాలను ఆదివారం పరీక్షల్లో రాశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర వయోజన విద్య ఉపసంచాలకులు ఎం.డీ.నుమాన్‌, జిల్లా ఉపసంచాలకులు డి.ఆంజనేయులు పరిశీలించారు. డీఆర్‌డీవో మచ్చ గీత పరీక్షల తీరును పర్యవేక్షించారు.

ఆగస్టులో రెండోదశ పరీక్షలు

కనీస విద్య అందరికీ అవసరమని ప్రభుత్వం ‘ఉల్లాస్‌’ నిర్వహిస్తోందని వయోజన విద్య ఉపసంచాలకులు నుమాన్‌ తెలిపారు. రెండోదశలో అక్షరమాల పరీక్షలు ఆగస్టులో నిర్వహిస్తామన్నారు. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చేదిద్దే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

వ్యాసరచనలో సత్తాచాటిన శ్రీనిధి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): రాష్ట్రస్థాయిలో భాషోపాధ్యాయ సంఘం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మండలంలోని నామాపూర్‌ మోడల్‌స్కూల్‌ పదో తరగతి విద్యార్థిని వేదునూని శ్రీనిధి సత్తాచాటింది. హన్మకొండలో జరిగిన వేడుకలో రూ.2వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. శ్రీనిధిని ప్రిన్సిపాల్‌ కొండల్‌రెడ్డి, తెలుగు పండితుడు పాక అంజయ్య అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement