ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ డబుల్‌బెడ్‌రూమ్ కేసీఆర్ కాలనీలో నీటిఎద్దడి నెలకొంది. కేసీఆర్ కాలనీతోపాటు పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలో సైతం నీటికి గోస పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. మిషన్ భగిరథ నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కాలనీల్లో వారం రోజులుగా నీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. కాలనీకి నీటిని అందించే బోరుబావిలో అడుగంటడం, మోటారు కాలిపోవడంతో నీటికి కటకట ఏర్పడిందన్నారు. పంచాయతీ అధికారులు నీటికష్టాలు తీర్చేందుకు నిత్యం ట్యాంకర్ ద్వారా సంపులోకి నీటిని అందిస్తున్నారన్నారు. అయినా నీరు సరిపోవడం లేదన్నారు. బోరు రిపేరు చేసి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ సిబ్బంది తెలిపారు.


