బాహుబలిపై మీరేమంటారు?
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రామగుండం కోల్‌మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద భారీ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్‌కాస్ట్‌గా పిలుస్తోన్న రామగుండం కోల్‌మైన్ కోసం శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 4,326.08 హెక్టార్ల భూమి అవసరం అవనుంది. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. (అందులో 397.9 హెక్టార్ల అటవీ భూమి, 2,868 అటవీయేతర భూమి) అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి (అందులో 305 హెక్టార్ల అటవీ భూమి, 753 హెక్టార్లు అటవీయేతర భూమి) అవసరం అవుతుంది. ఈ భూమి కూడా ఇప్పటికే సింగరేణి పరిధిలోనే ఉంది. రామగుండం కోల్‌మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతున్నాయి. అందులో రామగుండం ఓపెన్‌కాస్ట్ –1, ఎక్స్‌టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్‌కాస్ట్–2, అడ్రియాల షాప్ట్ అండర్‌గ్రౌండ్ కోల్‌మైనింగ్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు, వకీల్‌పల్లి మైన్‌తోపాటు మూసివేసిన 10వ ఇంక్లైన్ గనులను కలిపి భారీ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.
పర్యావరణ సమస్యలపైనే ప్రజాభిప్రాయం..
బాహుబలి గనినుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నులపాటు బొగ్గును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసివేసిన 10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్‌కాస్ట్‌గా మార్చనున్నారు. అనంతరం ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్‌పల్లి మైన్‌ను కూడా ఓపెన్‌కాస్ట్‌గా మారుస్తారు. ఇంతటి భారీ గని కారణంగా చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడతారని, వ్యవసాయం, పాడిపంటలు, సంప్రదాయల కులవృత్తులు, జీవనోపాధులు దెబ్బతింటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లక్రితం ఈ ప్రాజెక్టు కోసం తమ గ్రామాల్లో భూసేకరణ చేసేటప్పుడు పునరావాసంతోపాటు, సింగరేణిలో కొలువులు కల్పిస్తామన్న అధికారులు ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. పర్యారవణం మాట అటుంచితే.. తమకు బతుకుదెరువు కరువైందని వాపోతున్నారు. అదే సమయంలో సాధారణంగా విద్యుదుత్పత్తి కోసం టన్ను బొగ్గును కాల్చినప్పుడు దానిలోని కార్బన్, ఆక్సిజన్‌తో కలిసి సుమారు 2.2 నుంచి 2.9 టన్నుల కార్బన్ డయాకై ్సడ్‌ను విడుదల చేస్తుంది. ఇదీకాక ఆమ్లవర్షాలకు కారణమైన సల్ఫర్ డైయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ ఉద్గారాలకు కూడా కారణమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ప్రభావిత గ్రామాల ప్రజల
ప్రధానమైన డిమాండ్లు
● దుమ్ముతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి
● ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులో బ్లాస్టింగ్‌ల వల్ల ప్రభావిత గ్రామమైన జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు
● కిడ్నీల సమస్యలతోపాటు వివిధ రకాలుగా రోగాలకు గురవుతూ అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు
● సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముల్కలపల్లి గ్రామాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ రేడియేషన్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు
● భూసేకరణ వల్ల నిర్వాసితులైన గీత కార్మికులు, ఇతర నిరుద్యోగులకు జీవనోపాధి, వైద్యసదుపాయాలను కల్పించలేదు
● సింగరేణి విడుదల చేసే డీఎంఎఫ్‌టీ నిధులను కేవలం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి మాత్రమే దోహదపడేలా చర్యలు తీసుకోవాలి.
నేడు మంథని జేఎన్టీయూలో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ
హాజరవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
తొమ్మిది గ్రామాల్లో భూమి వెయ్యి హెక్టార్లలో ప్రాజెక్టు
ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానికుల ఆందోళన


