రూ.38.40 కోట్లు
మద్యం విక్రయాలు ఇలా..
(డిసెంబరు 1 నుంచి 17)
మద్యం వ్యాపారులకు కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు
గతేడాదితో పోల్చితే 70 శాతం అదనపు విక్రయాలు
పక్షం రోజుల్లోనే జోరుగా వ్యాపారం
ఎన్నికల
కిక్కు
సిరిసిల్ల: జిల్లాలో లిక్కర్ వ్యాపారులకు గ్రామపంచాయతీ ఎన్నికల కిక్కు లక్కులా మారింది. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రావడంతో లక్కీ లాటరీల్లో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులకు ఆరంభంలోనే పంచాయతీ ఎన్నికల సీజన్ తాకింది. అంతే.. మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 1వ తేదీ నుంచి 17 వరకు జిల్లాలో భారీ ఎత్తు మద్యం విక్రయాలు సాగాయి. ఆబ్కారీ శాఖ అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగాయి. గతేడాది డిసెంబరుతో పోల్చితే 70 శాతం అదనపు లిక్కర్ విక్రయాలు సాగినట్లు తెలుస్తోంది.
బెల్ట్ షాపులు మూసినా.. వైన్స్‌లు బంద్ చేసినా..
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే నవంబరు 26వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా బెల్ట్‌షాపులపై పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. గ్రామాల్లో బెల్ట్‌షాపుల్లో లిక్కర్ విక్రయానికి వీలులేదని హెచ్చరిస్తూ.. నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో జిల్లాలో సుమారు 1,260 బెల్ట్‌షాపులు మూతపడ్డాయి. మరోవైపు ఎన్నికలకు 48 గంటల ముందే ఆయా ప్రాంతంలోని మద్యం దుకాణాలను మూసివేశారు. కానీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ముందే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి రహస్య ప్రాంతాల్లో నిల్వచేశారు. అత్యవసరమైతే మద్యం షాపులు తెరిచి ఉన్న ప్రాంతాల నుంచి లిక్కర్‌ను తెచ్చుకున్నారు. దీంతో మద్యం అమ్మకాలకు లోటు లేకుండా పోయింది. పోలీసుల ఆంక్షలు, ఎక్సైజ్ శాఖ నిఘా మధ్య జిల్లాలో లిక్కర్ విక్రయాలు ఏమాత్రం తగ్గలేదు.
సిరిసిల్లదే అగ్రస్థానం
మద్యం విక్రయాల్లో సిరిసిల్ల సర్కిల్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 18 షాపులు, నాలుగు బార్లు ఉండగా.. 17 రోజుల్లో రూ.15.27 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. వేములవాడ ప్రాంతంలో 16 వైన్‌షాపులు, నాలుగు బార్లు ఉండగా.. రూ.13.21 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో 14 మద్యం దుకాణాలు ఉండగా.. రూ.9.92కోట్ల విక్రయాలు సాగాయి. ఇలా జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి.
గతేడాది డిసెంబరులో..
ఏటా డిసెంబరులో కొత్త సంవత్సర సంబరాల సందర్భంగా విక్రయాలు జోరుగా సాగుతాయి. దసరా పండగతో పోటీపడుతూ డిసెంబరు 31వ తేదీ రాత్రి మందు, విందులకు భారీగా లిక్కర్ అమ్మకాలు సాగుతాయి. 2024 డిసెంబరులో జిల్లాలో రూ.53.22కోట్ల వ్యాపారం సాగింది. ఇందులో సిరిసిల్ల సర్కిల్‌లో రూ.19.65కోట్లు, ఎల్లారెడ్డిపేటలో రూ.16.80కోట్లు, వేములవాడ సర్కిల్‌లో రూ.16.78 కోట్ల విక్రయాలు జరిగాయి. డిసెంబరు ముగింపునకు ఇంకా 13 రోజులు బాకీ ఉండగానే.. 17 రోజుల్లోనే రూ.38.40 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం. ఎకై ్సజ్‌శాఖ అధికారుల అంచనాల ప్రచారం గతేడాదితో పోల్చితే.. డిసెంబరు 17వ తేదీ నాటికి 70 శాతం మేరకు మద్యం అమ్మకాలు అదనంగా సాగినట్లు భావిస్తున్నారు. డిసెంబరు 31వ తేదీ నాటికి అంచనాలకు మించి మద్యం అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏది ఏమైనా కొత్తగా మద్యం షాపులను లక్కీ లాటరీల్లో దక్కించుకున్న వ్యాపారులకు మాత్రం గ్రామపంచాయతీ ఎన్నికలు వరంలా మారాయి. రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీసీటీ సభ్యుల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయనే ఊహాగానాల మధ్య ఈ ఏడాది లిక్కర్ దందాకు అదనపు కిక్కు ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు.
సిరిసిల్లలోని వైన్‌షాపు
వైన్‌షాపులు : 48, బార్లు : 08
విక్రయాలు : 34,804 కేసులు
బీర్ల అమ్మకాలు : 42,211 కేసులు
మద్యం విక్రయాల విలువ : రూ.38.40 కోట్లు
రూ.38.40 కోట్లు


