అసైన్‌మెంట్ భూములపై ఆరా
సిరిసిల్ల: జిల్లాలో అసైన్‌మెంట్ భూములపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని గ్రామాల వారీగా ఉన్న అసైన్డ్ భూములు, పట్టాభూములు, ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. ధరణి పోర్టల్‌కు భూభారతి పోర్టల్ లెక్కలకు తేడాలు ఉండడంతో క్షేత్రస్థాయి సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల్లోనూ తేడాలు సవరించేందుకు మండలాలవారీగా రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ రికార్డులను, మ్యానువల్ రికార్డులను సరిచూస్తున్నారు. మరోవైపు సర్వేనంబర్ల వారీగా పరిశీలిస్తే.. రికార్డుల్లో ఎక్కువ భూమి నమోదైనట్లు తేలింది. అదనపు భూమి విస్తీర్ణం ఎలా వచ్చిందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. భూములకు సంబంధించిన పాతరికార్డులనూ ఆరా తీస్తున్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఇదే పనిలో కలెక్టరేట్‌లో నిమగ్నమయ్యారు. గ్రామాలవారీగా, సర్వే నంబర్లవారీగా భూరికార్డులను, అసైన్‌మెంట్ భూముల వివరాలను సేకరిస్తూ.. సంస్కరించే పనిలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం బిజీగా ఉంది.


