గల్ఫ్‌లో గుండెపోటుతో ఎల్లారెడ్డిపేటవాసి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సొంతూరిలో ఉపాధిలేక బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఓ వలసజీవి గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటనతో ఎల్లారెడ్డిపేటలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలనర్సు(40) గత 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. బాలనర్సు మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య దేవ కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులను ఆమె వేడుకుంటుంది.
వలస కార్మికుడు ఆత్మహత్య
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం రాత్రి వలస కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ నుంచి రుద్రంగికి వచ్చిన వలసకార్మికుడు సన్ని(25) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. రుద్రంగి పోలీసులు శవ పంచనామా చేసి మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అటవీశాఖ అధికారిపై దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధికారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
రాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది.
గల్ఫ్‌లో గుండెపోటుతో ఎల్లారెడ్డిపేటవాసి మృతి


