ఆధిపత్య ఆరాటం
పెద్దపల్లిలో కాంగ్రెస్ జోరు
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
కాంగ్రెస్ 51శాతం, బీఆర్‌ఎస్ 29శాతం, బీజేపీ 9శాతం సీట్లు
నాలుగు నియోజకవర్గాల్లో పోటాపోటీ ఫలితాలు
తొలివిడత పొరపాట్లపై మూడు పార్టీల సమీక్ష
రెండు, మూడు విడతల్లో పైచేయి కోసం వ్యూహాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. తొలివిడతలో 397 గ్రామాలకు ఎన్నికలకు జరగ్గా 51శాతానికి పైగా (205) స్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 29శాతం (116) సీట్లు దక్కించుకుని బీఆర్‌ఎస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ 9శాతం (35) సీట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 398 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామం ఎన్నిక కోర్టు కేసు నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీఆర్‌ఎస్, బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఏయే గ్రామాల్లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎంత వ్యత్యాసంతో ఓటమి చెందారు? ఏ కారణాలు విజయావకాశాలను ప్రభావితం చేశాయన్న విషయాలపై పార్టీలపరంగా ఆలోచనలు చేస్తున్నారు.
బీజేపీ అనూహ్య ఫలితాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ బలపరచిన దాదాపు 35 మంది సర్పంచులు గెలిచారు. మరో 35మంది వరకు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్‌లో 14, సిరిసిల్లలో 07 స్థానాలు గెలచుకుని సత్తా చాటింది. జగిత్యాలలోనూ 14 స్థానాలు కై వసం చేసుకుని మొత్తంగా 35 సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయానికి రెండో, మూడో విడతలను వేదికగా చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. వాస్తవానికి ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌లోనే తాము బలపరిచిన 50 మంది సర్పంచ్‌గా గెలిచారంటూ ప్రకటించడం విశేషం. మొత్తానిక బీజేపీ అనూహ్య ఫలితాలు ఆ పార్టీలో సరికొత్త జోష్ నింపింది.
10శాతం ఇతరులపై అధికార పార్టీ కన్ను
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 44 మంది అభ్యర్థులు ఇతరులు/ స్వతంత్రులు ఉన్నారు. వీరందరినీ ఇప్పటికే అధికార పార్టీ తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపుగా వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 116 మంది సర్పంచుల్లో పలువురితో అధికార పార్టీ మంతనాలు మొదలుపెట్టింది. గెలిచిన వారంతా మనోళ్లే అన్న సిద్ధాంతంతో అధికార పార్టీ ముందుకు వెళ్తుండగా.. అప్పులు చేసి గెలిచిన వాళ్లు, అధికార పార్టీతో మనకెందుకు అన్న ఆందోళనలో ఉన్న వారంతా హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచిస్తున్నారు. వీరంతా తోడైతే అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచుల సంఖ్య అమాంతం పెరగనుంది.
తొలివిడతలో పెద్దపల్లిలో కాంగ్రెస్ 90 గ్రామాల సర్పంచ్ స్థానాలకుగాను 70 స్థానాలు గెలిచి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్‌లో 92 స్థానాలకు కాంగ్రెస్ 44 గెలవగా, 24 చోట్ల కారు పార్టీ విజయం సాఽధించింది. జగిత్యాలలో 122కి 52 సర్పంచులను కాంగ్రెస్ గెలవగా.. 42 సర్పంచు సీట్లను బీఆర్‌ఎస్ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. సిరిసిల్లలోనూ 85 సర్పంచి స్థానాలలో 39 కాంగ్రెస్ దక్కించుకోగా.. 28 బీఆర్‌ఎస్ వశపరచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా సర్పంచి స్థానాల కోసం పోటీ పడ్డాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్, కోరుట్లలో బీఆర్‌ఎస్ చక్కటి ఫలితాలు సాధించింది. 14వ తేదీన జరగనున్న రెండో విడత, 17వ తేదీన జరిగే మూడో విడతలో మరిన్ని సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు.
ఆధిపత్య ఆరాటం
ఆధిపత్య ఆరాటం


