తుది అంకానికి పల్లె పోరు
ముగిసిన మూడో విడత నామినేషన్లు రెండో విడత నేడు ఉపసంహరణ మొదటి విడత అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం
మూడో విడత నామినేషన్లు
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు
స్థానాలు స్థానాలు
ఎల్లారెడ్డిపేట 26 204 226 571
వీర్నపల్లి 17 98 132 219
ముస్తాబాద్ 22 – 202 –
గంభీరావుపేట 22 161 202 582
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 9 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మరిన్ని ఏకగ్రీమయ్యే అవకాశం ఉంది. అనేక గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి బహుముఖ పోటీ నెలకొంది. తొలి విడత ఎన్నికలు 11వ తేదీన జరుగుతుండగా.. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో పోటాపోటీగా ప్రచా రం చేస్తున్నారు. చందుర్తి, వేములవాడరూరల్, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ మండలాల్లో మైకుల మోతలు మోగుతున్నాయి.
నామినేషన్ల ఉపసంహరణకు బుజ్జగింపులు
బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారం వరకు ఉండడంతో పోటీలో ఉన్న రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తున్నారు. మరోవైప రాయ‘భేరాలు’ సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయిస్తూ ప్రధాన అభ్యర్థులను తప్పించే పనిలో పడ్డారు.
మూడో విడత ముమ్మరంగా నామినేషన్లు
మూడో విడత ఎన్నికలు ఈనెల 17న జరగనుండగా.. నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో సాయంత్రం 5 గంటల లోపు క్లస్టర్ ఆఫీస్‌లకు చేరిన వారికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడత నామినేషన్ల పర్వంలో దొర్లిన అపశ్రుతితో నామినేషన్ల దాఖలు ఫొటోలను మీడియాకు అనుమతించ లేదు. అభ్యర్థితోపాటు ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతించారు.
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్/గంభీరావుపేట: మూడో విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో చివరి రోజు శుక్రవారం నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. ముస్తాబాద్, నామాపూర్, పోతుగల్, గూడెం, బందనకల్, చీకోడు క్లస్టర్లలో సాయంత్రం దాటినా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు క్యూలో ఉన్నారు. గంభీరావుపేట మండలంలోని 9 నామినేషన్ కేంద్రాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసే అభ్యర్థుల సందడి నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా అభ్యర్థులు క్యూలో ఉన్నారు. మండలంలోని రాచర్ల తిమ్మాపూర్లో అభ్యర్థులు రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు దాఖలు చేశారు.


