575 మందిపై అనర్హత వేటు !
● 2019లో ఎన్నికల ఖర్చు చూపకపోవడమే కారణం ● ఎన్నికల వాయిదాతో కలిసి వచ్చిన అవకాశం
సిరిసిల్ల అర్బన్: జిల్లాలో 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఖర్చుల వివరాలు చూపని 575 మందిపై ఎన్నికల సంఘం 2021లో అనర్హత వేటువేసింది. ఫలితంగా మీరు మూడేళ్లపాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులే. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఖర్చు చేసిన ప్రతీ పైసాకు విధిగా లెక్కలు చెప్పాలి. లేదంటే తర్వాత అనర్హత వేటు పడుతుంది. ఇదీ ఎన్నికల సంఘం విధించిన నిబంధన. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఇవేమి పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 2019లో గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసి లేక్కలు చూపని వారు జిల్లాలో 575 మందిపై వేటుపడింది. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారిలో 45 మంది ఎన్నికల ఖర్చులు చూపలేదు. వార్డు సభ్యులుగా జిల్లాలో 34 మంది ఎన్నికై లెక్కలు చూపకపోవడంతో వీరిపై అనర్హత వేటుపడింది. వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయిన వారిలో 446 మంది ఖర్చులు చూపలేదు. వీరందరిపై ఎన్నికల సంఘం అనర్హత వేటువేసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ముగ్గురు, ఎంపీటీసీలుగా పోటీచేసి ఓడిపోయిన 47 మంది ఎన్నికలు పూర్తయినా ఇచ్చిన గడువులోపు లెక్కలు చూపకపోవడంతో వీరిపై అనర్హత వేటు వేసింది.
ఎన్నికలు వాయిదాతో కలిసివచ్చిన అవకాశం
పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీన ముగియగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం గతేడాది జూలైలో ముగిసింది. సకాలంలో ఎన్నికలు జరిగితే వేటుపడిన అభ్యర్థులు పోటీచేసే అవకాశం కోల్పోయేవారు. కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో జిల్లాలో 575 మంది అనర్హత పొందిన అభ్యర్థులకు మళ్లీ పదవులకు పోటీచేసే అవకాశం లభించింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 11 నుంచి మూడు విడతలుగా గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 2019లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో అనర్హత పొందిన అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. స్థానికసంస్థల ఎన్నికలు వాయిదాతో ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిసి వచ్చింది.


