గుర్తుంచుకోండి! | - | Sakshi
Sakshi News home page

గుర్తుంచుకోండి!

Dec 5 2025 6:54 AM | Updated on Dec 5 2025 6:54 AM

గుర్త

గుర్తుంచుకోండి!

అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితా

అభ్యర్థుల్లో ‘గుర్తు’ల గుబులు

మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభం

ఒకే పోలికలో పలక.. బ్లాక్‌బోర్డు.. బిస్కట్‌

బ్యాలెట్‌పత్రాలపై కనిపించని అభ్యర్థుల పేర్లు, ఫొటోలు

నోటాతో కొత్త చిక్కులు

పరిమిత ఓట్లకు ‘గుర్తుల’ తికమక

సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. సర్పంచ్‌, వార్డుసభ్యుల స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. చాలా గుర్తులు ఒకే పోలికతో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు వాటిని ‘గుర్తు’ంచుకోవడం కష్టంగానే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం గుర్తు మాత్రమే ఉంటుంది. పరిమిత ఓట్లు కావడంతో ప్రతీ ఓటు కీలకమే. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో గుబులు రేపుతున్న గుర్తులపై కథనం.

ప్రతిష్టాత్మకంగా పల్లెపోరు

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా సాగుతున్నాయి. తొలివిడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జిల్లాలో ఇప్పటికే 9 గ్రామాలు, 209 వార్డుల్లో సింగిల్‌ నామినేషన్‌తో ఏకగ్రీవమయ్యాయి. తొలివిడత 76 గ్రామాల్లో ఎన్నికలకు 295 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 539 వార్డుల్లో 1,377 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈనెల 11న తొలివిడత ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రెండోవిడత నామినేషన్ల పర్వం ముగిసింది. మూడో విడతకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలివిడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు బుధవారం గుర్తులు కేటాయించారు. ఈ గుర్తులతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తమకు వచ్చిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. సామాన్యులు గుర్తుంచుకోవడం కష్టంకావడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు పెద్ద సమస్యగా మారింది.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. సర్పంచ్‌ అభ్యర్థులకు 30, వార్డుసభ్యులకు 20 గుర్తులను ఎన్నికల సంఘం నిర్ధేశించింది. సర్పంచ్‌ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, బ్యాట్‌, కప్‌సాసర్‌, విమానం, బంతి, షెటిల్‌, కుర్చీ, వంకాయ, నల్లబోర్డు, కొబ్బరికాయ, లేడీపర్సు, మామిడికాయ, సీసా, బకెట్‌, బుట్ట, దువ్వెన, అరటిపండ్లు, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైటు, బ్రష్‌, క్యారెట్‌, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చెంచాగుర్తులను కేటాయించారు. వార్డుసభ్యులుగా పోటీచేసే వారికి జెగ్గు, గౌను, గ్యాస్‌స్టౌవ్‌, స్టూలు, సిలిండర్‌, గాజుగ్లాస్‌, బీరువా, ఈల, కుండ, డిష్‌యాంటీనా, గరిటె, ముకుడు, విల్లుబాణం, పోస్టుకవర్‌, హాకీ, నెక్‌ టై, కటింగ్‌ప్లేయర్‌, పోస్టుడబ్బా, విద్యుత్‌ స్తంభం, క్యాండిల్‌ గుర్తులను కేటాయించారు.

పోలికలున్న గుర్తులెన్నో..

ఒకే పోలికతో పలు గుర్తులు ఓటర్లను తికమక చేసే అవకాశముంది. పలక, బ్లాక్‌బోర్డు, మంచం ఒకేలాగా ఉండడంతో ఓటర్లు ఇబ్బందిపడే అవకాశముంది. దువ్వెన, అరటిపండు గుర్తులు ఒకేలా ఉన్నాయి. ఇలాంటి గుర్తులతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుర్తులు కొన్నింటిని ఎవరూ గుర్తుపట్టలేకపోతారు. ఫోర్క్‌, చెంచా ఒకేలా ఉండడం, నెక్‌టై వంటి వస్తువులు కొత్తగా కనిపించడంతో గుర్తుపట్టడం ఇబ్బందిగా మారనుంది. పరిమిత ఓట్లతో సాగే పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు ఓటర్లు గుర్తుంచుకునేలా చెప్పడం అభ్యర్థులకు కష్టంగా మారింది.

నోటాతో తిప్పలు

గుర్తును గుర్తుంచుకొని ఓటు వేయాల్సి ఉండడం, బ్యాలెట్‌పత్రంలో నోటాను చేర్చడం ప్రతికూలంగా మారింది. ప్రతీ ఓటు కీలకమైన పల్లెఎన్నికల్లో నోటాకు ఓట్లు పడితే గెలుపోటములను నోటా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3,53,351 మంది ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో భాగస్వాములవుతున్నారు. ఓటర్ల మదిలో గుర్తులు బలంగా నిలిపేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏకగ్రీవమైన గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించకపోగా పోటీ ఉన్న గ్రామాల్లో మాత్రం పంచాయతీ ఎన్నికలు చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి.

గుర్తుంచుకోండి!1
1/1

గుర్తుంచుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement