పరీక్షల శాఖ ఖాళీ !
● ఒకరు రిటైర్డ్.. మరొకర సస్పెన్షన్ ● ఖాళీగా డీసీఈబీ, ఏసీజీఈ పోస్టులు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలో పరీక్షల నిర్వహణశాఖ లో ప్రధాన పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. నిర్ణయాధికారం తీసుకునే స్థాయి పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాలో పలు పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాస్ రిటైర్డ్ కాగా.. ఇటీవల ఏసీజీఈగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. దీంతో విద్యాశాఖలో కీలకమైన పరీక్షబోర్డులోని కీలకమైన డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ, అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. దీని ప్రభావం పలు పరీక్షల నిర్వహణపై పడనుందని ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.
ఎవరూ లేని పరీక్షల విభాగం
ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు, ప్రీ–ఫైనల్ ప్రశ్నాపత్రాల ముద్రణ, ఎస్‌ఏ పరీక్ష పేపర్ల సంసిద్ధత, ఈ ఆదివారం నవోదయ పరీక్ష నిర్వహణపై ఆందోళన నెలకొంది.
ఆశావహుల పోటీ
రెండు పోస్టుల ఖాళీల నేపథ్యంలో పలువురు ప్రధానోపాధ్యాయులు పరీక్షల విభాగంలో బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరీక్షల విభాగ నియంత్రణ సహాయాధికారి పోస్ట్ కోసం బొల్గం శ్రీనివాస్(విలాసాగర్ హెచ్‌ఎం), మనోహర్‌రెడ్డి(గోరంటాల హెచ్‌ఎం), మోతీలాల్(శివనగర్ హెచ్‌ఎం) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పరీక్షల విభాగంలోని రెండు ప్రధాన పోస్టుల్లో ఏదో ఒకదాని బాధ్యతలు తీసుకునేందుకు నారాయణపూర్ హెచ్‌ఎం ఆకునూరి చంద్రశేఖర్ ఉత్సాహంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఒకటి భర్తీ చేస్తే మరొకటి ఖాళీ
డీఈవో పోస్టును రెగ్యులరైజ్ చేసేందుకు చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. డీఈవోగా అదనపు బాధ్యతలతో ఉన్న జెడ్పీ సీఈవో వినోద్ ఇప్పుడిప్పుడే విద్యాశాఖపై పట్టు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యాశాఖను అర్థం చేసుకునేలోపే ప్రధానమైన రెండు పోస్టులు ఖాళీ కావడం పరీక్షల విభాగంలో గందరగోళాన్ని సృష్టించింది. ఈ ఖాళీలను ఎలా భర్తీ చేస్తారోననే చర్చ సాగుతోంది.


