పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరిలోగా సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం మండలకేంద్రంలోని మోడల్‌స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. ఏడో తరగతి గదిలో ఇంగ్లిష్ పాఠం జరుగుతుండగా.. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేలా సిద్ధం కావాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్, డీఏవో అఫ్జల్‌బేగం, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ
సిరిసిల్లటౌన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై తహసీల్దార్లు, ఎంపీవోలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లకు కలెక్టరేట్‌లో మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుందన్నారు. వారికి సంబంధిత అప్లికేషన్లు ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, నిబంధనల ప్రకారం నింపి అందజేయాలని సూచించారు. నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.


