బెదిరింపుల పర్వం !
● హద్దులు దాటుతున్న కులసంఘాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ ఎలక్షన్స్ అంటేనే కులసంఘాల ఆధిపత్యం స్పష్టంగా ఉంటుంది. కులపెద్దలు చెప్పిందే వేదంలా ప్రవర్తిస్తుంటారు. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సైతం వారు శాసిస్తుంటారు. ఈక్రమంలోనే తాము చెప్పిందే వినాలంటూ కులస్తులకు హుకూం జారీ చేశారు. ఎన్నికల బరిలో తాము చెప్పినవారే ఉండాలని.. కాదు కూడదు అంటే ఆంక్షలు తప్పవంటూ హెచ్చరికలు రాజీ చేస్తున్నారు. తాము నిర్ణయించిన అభ్యర్థే సర్పంచ్‌గా పోటీలో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కాదు కూడదని వేరొకరు ముందుకొస్తే కులబహష్కిరణ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి, మండెపల్లి గ్రామాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. కులసంఘాలకు రూ.లక్షలు ఇచ్చిన వాడికి మద్దతు ఇవ్వడం, కులసంఘం నిర్ణయించినవారే పోటీలో ఉండాలని హుకూం జారీ చేయడంతో సర్పంచ్‌గా పోటీ చేద్దామని సిద్ధంగా ఉన్న ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. పోటీకి దిగితే ఎక్కడ కులబహిష్కరణ చేస్తారోనని భయపడుతున్నారు.
ఓటుహక్కు కలిగిన ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడే. పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధం. ఇలాంటి ఘటనలు జరిగితే కేసులు నమోదు చేస్తాం.
– ఉపేంద్రచారి, ఎస్సై తంగళ్లపల్లి
బెదిరింపుల పర్వం !


