నేతన్నలకు చేతినిండా పని
మరో 35 లక్షల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇప్పటికే 65 లక్షల చీరలు సిద్ధం ముగింపుదశలో మొదటి ఆర్డర్లు రూ.77కోట్ల విలువైన 2.10 కోట్ల మీటర్ల ఆర్డర్లు
సిరిసిల్ల: నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందిస్తోంది. ఇప్పటికే 65 లక్షల చీరలను తయారు చేశారు. వీటిని గ్రామపంచాయతీలకు తరలించారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు రాగా.. టెస్కో ఆదేశాలతో 4.34 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. ఇందులో 4.29 కోట్ల మీటర్ల బట్టను అందించారు. కేవలం 5 లక్షల మీటర్ల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉంది. మొదటి ఆర్డర్లు ముగింపు దశకు చేరుకోవడంతో రెండో దఫాగా మరో 35 లక్షల చీరలకు 2.10 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లను ఇస్తున్నారు. ఈ ఆర్డర్ల విలువ రూ.77 కోట్లు. మొదటి దశ ఆర్డర్లు పూర్తి చేసిన నేతన్నలు పని లేదని దిక్కులు చూస్తున్న సమయంలో రెండో దఫా ఆర్డర్లు రావడంతో మరో మూడు నెలలపాటు ఉపాధి లభించనుంది.
కోటి మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో..
రాష్ట్ర ప్రభుత్వం తొలుత 65 లక్షల మంది స్వశక్తి సంఘాల సభ్యులకు చీరల అందించాలని భావించి ఆర్డర్లు ఇచ్చింది. ఈ చీరలు నాణ్యతగా ఉండడంతో మహిళలు మెచ్చారు. దీంతో రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ‘తెలంగాణ సారె’ పేరుతో చీరను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. తొలి విడతగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మందికి, రెండో విడతగా.. రానున్న మార్చిలో పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న హైదరాబాద్‌లో చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ సాగుతుండగా.. పంచాయతీ ఎన్నికలు రావడంతో చీరల పంపిణీ నిలిచిపోయింది.
రెండు రకాల చీరలు
మహిళలకు అందించే చీరలను డిజైన్ చేసి సిరిసిల్ల నేతన్నలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు అందించారు. ఇందులో జరీ అంచు బార్డర్‌తో 6.30 మీటర్ల పొడవు ఉండే చీరలను 55 లక్షల మేరకు ఆర్డర్లు ఇవ్వగా.. మరో 12 లక్షల మేరకు 9 మీటర్ల గోచీ చీరల ఆర్డర్లు ఇచ్చారు. 58 ఏళ్లు పైబడిన మహిళా సంఘాల్లోని వృద్ధులకు గోచీ చీరలను అందించేందుకు సిరిసిల్లలో 9 మీటర్ల పొడవు ఉండే చీరల ఆర్డర్లు ఇచ్చారు. ఈ చీరలు ఇక్కడే ఉత్పత్తి, ప్రాసెసింగ్ చేశారు. జరీ అంచుతో కూడిన పాలిస్టర్, కాటన్ మిక్స్ చీరలను సూరత్‌లో ప్రాసెసింగ్ చేశారు.
నూలు అందిస్తూ.. బట్ట ఉత్పత్తి
సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్‌లోనూ మరో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే యారన్(నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్ స్టాక్‌గా ఉంచడానికి రూ.50కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేసింది. వస్త్రోత్పత్తిదారులకు నూలును 90 శాతం అరువుపై సరఫరా చేయడంతో చీరల ఉత్పత్తిలో వేగం పెరగడంతోపాటు నాణ్యతగా ఉన్నాయి.
ఖరీదు పెంచి ఉత్పత్తి
గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా.. ఇందిరా మహిళాశక్తి చీర ఖరీదు రూ.480 నిర్ధారించారు. ఈమేరకు నాణ్యమైన నూలును ప్రభుత్వమే సరఫరా చేస్తూ చీరల బట్టను ఉత్పత్తి చేయిస్తుంది. బతుకమ్మ చీరల కంటే నాణ్యతతో చీరలను అందించడంతో మహిళలు ఈ చీరలను ఇష్టపడుతున్నారు. పాలపిట్ట కలర్‌లో చీరను డిజైన్ చేశారు. రెండో ఆర్డర్ రావడంతో సిరిసిల్లలోని 10వేల మంది కార్మికులకు ఏడాది పొడవునా చేతినిండా పని లభించే అవకాశం దక్కింది.
పవర్‌లూమ్ పరిశ్రమ స్వరూపం
పవర్‌లూమ్స్: 26,302
మ్యాక్స్ సంఘాలు: 131
మహిళా శక్తి చీరల బట్టను నడుపుతున్న సాంచాలు: 9,600
ఇప్పటి వరకు పొందిన చీరల బట్ట ఆర్డర్లు : 4.24 కోట్ల మీటర్లు
ఇప్పటి వరకు సేకరించిన చీరల బట్ట : 4.29 కోట్ల మీటర్లు
పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తి అవుతున్న బట్ట : 5 లక్షల మీటర్లు
కొత్తగా వస్త్రోత్పత్తి ఆర్డర్లు : 2.10 కోట్ల మీటర్లు
ఈ ఆర్డర్ విలువ : రూ.77 కోట్లు
నేతన్నలకు చేతినిండా పని


