క్రీడలతో నైపుణ్యం వెలికితీత
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల అర్బన్: గ్రామీణ యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడాపోటీలు దోహదపడతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్‌నగర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీహరితో మాట్లాడి వేములవాడలో రాష్ట్ర, జాతీయస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తాన్నారు. క్రీడా మైదానాల కోసం సిరిసిల్ల, వేములవాడ, కోరుట్లలో ఐదెకరాల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్వీ హన్మంతరెడ్డి, కృష్ణప్రసాద్, కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, అసోసియేషన్ నాయకులు చిలుక శ్యామ్, అజ్మీరా రాందాస్, గణపతి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


