హత్యకేసులో ప్రధాన నిందితుడి రిమాండ్
వేములవాడఅర్బన్: వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్ బల్లెపు నర్సయ్య, అలియాస్ సిద్ధన్న అలియాస్ బాపురెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు జక్కుల సంతోష్‌ను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ ఇన్‌చార్జి డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న గతంలో మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్‌గా పనిచేసేవాడు. 1999లో వీర్నపల్లి బస్టాండ్ వద్ద అదే గ్రామానికి చెందిన అంజయ్యను పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా భావించి కాల్చివేశారు. దీనిపై ఎల్లారెడ్డిపేట ఠాణాలో కేసు నమోదైంది. ఈ ఘటనపై అంజయ్య కుమారుడు జక్కుల సంతోష్ తన తండ్రిని చంపిన వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవల బల్లెపు నర్సయ్య ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన సంతోష్ మరింత పగతో రగలిపోయాడు. బల్లెపు నర్సయ్యతో తాను ఒక రిపోర్టర్‌గా పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలలుగా ఇంటర్వ్యూ చేస్తానని నమ్మించి వేములవాడ మండలం ఆగ్రహరం గ్రామానికి రావాలని నర్సయ్యకు చెప్పాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు అగ్రహారం చేరుకున్నారు. సంతోష్ ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న సమయంలో రాళ్లతో దాడి చేసి నర్సయ్యను హత్య చేశాడు. ఈ ఘటనపై వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుడు జక్కుల సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రామ్మోహన్, పోలీసు సిబ్బందిని అభినందించారు.


