కోడెల పక్కదారిపై విచారణ
● గతంలో అక్రమంగా నాలుగు కోడెల తరలింపు ● విచారణకు ఆదేశించిన ఈవో
వేములవాడఅర్బన్: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ కోడెల పక్కదారిపై అధికారులు విచారణకు ఆదేశించారు. శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు కోడెమొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కొందరు భక్తులు స్వామి వారికి నిజకోడెలను సమర్పిస్తుంటారు. ఇలా భక్తులు అందజేసిన కోడెలను తిప్పాపూర్‌లోని గోశాలలో సంరక్షిస్తున్నారు. ఇలా భక్తుల ద్వారా వస్తున్న కోడెలతో గోశాల నిండిపోవడంతో కొన్నాళ్ల వరకు గోశాలలకు కోడెలను ఉచితంగా అందజేసేవారు. ఇలా వెళ్లిన కోడెలు పక్కదారి పడుతుండడంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ ఈవో రమాదేవి విచారణకు ఆదేశించారు.
గోశాల పేరిట పక్కదారి
2024 జనవరిలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బతండాలోని శ్రీసోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి 20 కోడెలను రాజన్న గోశాల నుంచి అందజేశారు. కోడెలను తీసుకెళ్తున్న వాహనాన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో తనిఖీ చేశారు. రాజన్న ఆలయం నుంచి 20 కోడెలను అందజేసినట్లు లేటర్ ఉండగా వాహనంలో 24 కోడెలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో పలు అవకతవకలు వెలుగుచూశాయి. అసలు ఆ ప్రాంతంలో గోశాలనే లేనట్లు తేలింది. వాహనంలో నాలుగు కోడెలు అదనంగా ఉండడంతో పోలీసులు రాజన్న ఆలయ ఉద్యోగులతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆలయ అధికారులకు అప్పుడే చార్జి మెమోలు జారీ చేశారు. గోశాలలోని కోడెలు పక్కదారి పట్టిన ఘటనపై రాజన్న ఆలయ ఈవో రమాదేవి ఇటీవల శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.


