పారదర్శకత.. ప్రశాంతతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారదర్శకత.. ప్రశాంతతే లక్ష్యం

Nov 29 2025 7:59 AM | Updated on Nov 29 2025 7:59 AM

పారదర

పారదర్శకత.. ప్రశాంతతే లక్ష్యం

సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ మైక్రో అబ్జర్వర్స్‌ను నియమిస్తాం ఏకగ్రీవ ఎన్నికలపై నిషిత పరిశీలన టీ–పోల్‌ను సద్వినియోగం చేసుకోవాలి తొలిసారి బ్యాలెట్‌ పత్రంలో ‘నోటా’ ‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: పారదర్శకంగా, ప్రశాంతంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు(ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్‌ సర్వలెన్స్‌ బృందాల

(ఎస్‌ఎస్‌టీ)ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీస్‌ చెక్‌పోస్టుల ద్వారా వాహనాలను తనిఖీ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

సెన్సిటివ్‌ కేంద్రాలపై మండలస్థాయిలో కమిటీ

జిల్లాలో సెన్సిటివ్‌(సమస్యాత్మక) పోలింగ్‌ కేంద్రాల నిర్ధారణకు మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్‌హెచ్‌వోలతో కమిటీలను ఏర్పాటు చేశాం. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను నిర్ధారించి ఎస్పీకి నివేదిక పంపిస్తారు. దాని ఆధారంగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ పర్యవేక్షిస్తారు. మా పరిధిలో ఆయా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ లేదా మైక్రో అబ్జ ర్వర్స్‌ను నియమిస్తాం. కొన్ని కేంద్రాల్లో అవసరమైతే కాలేజీ విద్యార్థులతో వీడియో తీయిస్తాం.

ఎన్నికల ఖర్చుపై డిక్లరేషన్‌ ఇవ్వాలి

జిల్లాలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు సాధారణ, వ్యయపరిశీలకులు పి.రవికుమార్‌, కె.రాజ్‌కుమార్‌ వచ్చారు. అభ్యర్థులు నిబంధనలకు లోబడి ఖర్చు చేస్తామని ముందుగానే అఫిడవిట్‌ ఇవ్వాలి. ఈసారి కొత్తగా ఈ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ తీసుకవచ్చింది. జిల్లాలో పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు అధికారులను మైక్రో అబ్జర్వర్లుగా నియమిస్తున్నాం.

టీ–పోల్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ఈసారి ఎన్నికల కమిషన్‌ టీ–పోల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రాల సమాచారం తెలుస్తుంది. ఏమైనా ఫిర్యాదులు ఉంటే యాప్‌ ద్వారా చేసే అవకాశం ఉంది. టీ–పోల్‌లో వచ్చిన ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరిస్తారు. సీ–విజిల్‌ తరహాలో టీ–పోల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టరేట్‌లోనూ 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూంను, హెల్ప్‌లైన్‌ను, మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే 1800 133 1495 నంబర్‌కు ఫోన్‌చేసి చెప్పవచ్చు. ఎన్నికల కమిషన్‌ ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ‘నోటా’కు అనుమతించింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకుంటే.. ‘నోటా’కు ఓటు వేయవచ్చు. ప్రతి ఒక్క ఓటరూ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలి.

జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు

జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ, వేములవాడరూరల్‌ మండలం ఫాజుల్‌నగర్‌, ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లి, బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌, రుద్రంగి శివారులోని మానాల క్రాస్‌రోడ్డు వద్ద పోలీస్‌ చెక్‌పోస్టులు ఉన్నాయి. 24 గంటలూ ఇవి పనిచేస్తాయి. జిల్లాలోకి అక్రమ మద్యం, డబ్బులు రవాణా జరగకుండా తనిఖీలు చేస్తున్నారు. రూ.50వేలకు మించి తరలిస్తే సీజ్‌ చేసి రశీదు అందిస్తారు. క్షేత్రస్థాయిలో చెక్‌పోస్టులను పరిశీలించాను.

మూడు విడతల్లో ఎన్నికలు

జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గ్రామాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశాం. జిల్లాలోని 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో రుద్రంగి, వేములవాడ, వేములవాడరూరల్‌, కోనరావుపేట, చందుర్తి మండలాల్లోని 85 గ్రామపంచాయతీలు, 748 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ ఎన్నికలకు శనివారంతో నామినేషన్ల దాఖలు ముగుస్తుంది. రెండో విడతలో బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 88 గ్రామపంచాయతీలకు, 758 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో విడతలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లోని 87 గ్రామపంచాయతీలు, 762 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆఫీస్‌లో సాయంత్రం 5 గంటల్లోపు ఉన్న అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు.

ఏకగ్రీవ ఎన్నికలపై నిషిత పరిశీలన

జిల్లాలో ఎన్నికలు లేకుండా గ్రామస్తులు ఐక్యతతో.. స్వచ్ఛందంగా పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి పరిణామం. కానీ లోపాయికారీగా వేలం పాటలు నిర్వహించడం, ప్రలో భాలకు గురిచేసి ఏకగ్రీవం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధం. నామినేషన్ల పర్వం ముగిసిపోయి, సింగిల్‌ నామినేషన్‌ వచ్చిన సందర్భాల్లో అదనపు కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఆర్‌డీవో కన్వీనర్‌గా కమిటీ ఉంది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నిషితంగా పరిశీలించి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగానే ఏకగ్రీవమైనట్లుగా ప్రకటిస్తాం.

రైతులకు ఇబ్బందులు లేకుండా..

ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా ఉన్నా రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 1.72 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తున్నాం. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమవుతున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులు కొనసాగుతున్నాయి.

పారదర్శకత.. ప్రశాంతతే లక్ష్యం1
1/1

పారదర్శకత.. ప్రశాంతతే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement