● సర్పంచ్ స్థానాలకు 149.. వార్డు స్థానాలకు 301
రెండో రోజు నామినేషన్ల జోరు
సిరిసిల్ల: జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. మొదటి విడత నా మినేషన్లకు శనివారంతో గడువు ముగియనుండడంతో చాలా మంది అభ్యర్థులు శుక్రవారమే నామినేషన్లు వేశారు. వేములవాడరూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ అర్బన్ మండలాల పరిధిలోని 85 సర్పంచ్ పదవులకు శుక్రవారం 149 మంది నామినేషన్లు వేశారు. గురు, శుక్రవారాల్లో కలిపి మొత్తం 191 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదు మండలాల పరిధిలోని 748 వార్డుస్థానాలకు 301 నామినేషన్లు శుక్రవారం దాఖలు కాగా, గురువారంతో కలిపి 332 వేశారు. శనివారం సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
రేపటి నుంచి రెండో విడతకు నామినేషన్లు
డిసెంబరు 14న జరిగే రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఆదివారంతో మొదలుకానుంది. ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 88 గ్రామపంచాయతీలకు, వాటి పరిధిలోని 758 వార్డుసభ్యుల స్థానాలకు రేపటి నుంచి నామినేషన్లు దాఖలుకానున్నాయి.


