అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు
● 29న దీక్షాదివస్‌ను సిరిసిల్లలో నిర్వహిస్తాం ● మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
సిరిసిల్ల: తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు.. అబద్దాలతో అధికారంలోకి వచ్చారని మాజీ ఎంపీ, ప్రణాళికసంఘం మాజీ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నేటి తరం యువతరానికి 2001 నాటి దగాపడిన తెలంగాణ కన్నీటిగాథలు తెలియవన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ దీక్ష చేసి, ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2009 నవంబరు 29న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష చేయడంతో యావత్ దేశం కదిలిపోయి, రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిందన్నారు. శ్రీతెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడోశ్రీ అని ప్రాణాలకు తెగించి పోరాడారని గుర్తు చేశారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు, రైతుల బలవన్మరణాలు, వలసలు.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడ్డ గోసలన్నారు. ఈనెల 29న సిరిసిల్ల అంబేడ్కర్ సర్కిల్‌లో దీక్షా దివన్‌ను నిర్వహిస్తామని, ఆనాటి ఉద్యమ ఫొటో ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారని తెలిపారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద దీక్షా దివస్ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ అరుణ, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ‘సెస్’ ఉపాధ్యక్షుడు దేవరకొండ తిరుపతి, ‘సెస్’ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, వరుస కృష్ణహరి, పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్, అక్కరాజు శ్రీనివాస్, గజభీంకార్ రాజన్న, మాట్ల మధు పాల్గొన్నారు.


