డేంజర్ జంక్షన్స్
కలెక్టరేట్ జంక్షన్ పనులు మొదలయ్యాయి
● అభివృద్ధి లేని చౌరస్తాలు ● సిరిసిల్లలో పెరుగుతున్న ట్రా‘ఫికర్’ ● రోడ్డు ప్రమాదాలతో భయాందోళన
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి సొబగులు దిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జంక్షన్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. సుందరీకరణ పేరుతో చేపట్టిన పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ప్రధా న చౌరస్తాలు బోసిపోతున్నాయి. నూతన కళ రాకపోగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో గోపాల్‌నగర్ చౌరస్తా, పాతబస్టాండ్ నేతన్నచౌక్, చంద్రంపేటచౌరస్తా, కలెక్టరేట్ ఎదుట గల జంక్షన్ డేంజర్‌గా మారాయి. కోట్ల రూపాయలు వెచ్చించినా ప్రమాదాలు తప్పడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు కలెక్టరేట్ జంక్షన్ వద్ద తికమక పడుతున్నారు.
సమస్యలు ఇక్కడ..
● సిరిసిల్లలోని గాంధీ సర్కిల్ ఇరుకుగా ఉండడంతో అక్కడ నిత్యం ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతుంది. సెస్ ఆఫీస్ నుంచి వేంకటేశ్వర ఆలయం వైపు వెళ్లే క్రమంలో ఇరుకై న మలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
● ప్రధాన రహదారులపై ఉన్న చంద్రంపేట, రగుడుతోపాటు పోస్టాఫీస్, బీవైనగర్, సుందరయ్యనగర్, పోలీస్‌స్టేషన్, మార్కెట్ ఏరియా, పెద్దబజార్ జంక్షన్లను విస్తరించాల్సిన అవసరం ఉంది.
● కొత్తబస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు డిపో, బస్టాండ్‌లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది.
● గోపాల్‌నగర్ చౌరస్తాలో బీవైనగర్, తారకరామానగర్, శివనగర్, మార్కెట్‌పల్లి, బోనాల, సుందరయ్యనగర్, ఇందిరానగర్, గణేశ్‌నగర్ ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పెరిగింది. ఆర్‌అండ్‌బీ ప్రధాన జంక్షన్ కావడంతో రోడ్డుపైకి ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రోడ్డెక్కె సమయం, యూటర్న్ తీసుకునే సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
● ఇప్పటికే అభివృద్ధి చెందిన అంబేడ్కర్ సర్కిల్ వద్ద చుట్టుపక్కల ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేయడం, ఆ ప్రాంతంలో తరచూ నిరసన ప్రదర్శనలు జరుగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
● నేతన్నచౌక్‌లో పాతబస్టాండ్, వెంకంపేట, పెద్దబజార్, అంబేడ్కర్‌చౌరస్తా ప్రాంతాల నుంచి భారీవాహనాలతో కలుపుకుని తిరుగుతాయి. జంక్షన్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
మీరు చూస్తున్న ఈ ప్రధాన సర్కిల్ కలెక్టరేట్ ఎదుట ఉన్న జంక్షన్. హైదరాబాద్–సిరిసిల్ల–కామారెడ్డి, సిద్దిపేట–వేములవాడ రూట్ల నుంచి వేలాది వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. సిరిసిల్లకు ప్రధాన చౌరస్తాగా మార్చాలనే ఉద్దేశంతో గతంలోనే రూ.3కోట్లతో స్మార్ట్ సర్కిల్ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ అన్ని రూట్ల నుంచి వచ్చే వాహనాలు తికమకగా ఉండే ఈ జంక్షన్లో ప్రమాదానికి గురవుతున్నాయి.
కలెక్టరేట్ జంక్షన్ అభివృద్ధికి రూ.3కోట్లతో పనులు ప్రారంభించాం. సర్కిల్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. పట్టణంలోని అన్ని సర్కిళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. నేతన్నచౌక్, చంద్రంపేట చౌరస్తాలను అభివృద్ధి చేస్తాం. – ఎంఏ ఖదీర్‌పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల
డేంజర్ జంక్షన్స్


