సమ్మక్క జాతరకు ఏర్పాట్లు
● ముందుగా వేములవాడకే భక్తుల రాక ● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ● డిసెంబర్ 10లోగా పనుల పూర్తికి కసరత్తు
వేములవాడ: గిరిజనుల అతిపెద్ద పండుగ సమ్మక్క–సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభంకానుంది. సమ్మక్క భక్తులు ముందుగా వేములవాడ రాజ న్నను దర్శించుకోవడం ఆనవాయితీ. రెండేళ్లకో సారి జరిగే గిరిజన జాతర కావడంతో అంతేస్థాయిలో భక్తులు వేములవాడకు వస్తుంటారు. త్వరలోనే సమ్మక్క భక్తుల రాక మొదలుకానుండడంతో అధికారులు ఏర్పాట్ల పనులను వేగిరం చేస్తున్నారు.
క్యూలైన్లు... కల్యాణకట్ట
జనవరి 28 నుంచి 31 సాగే సమ్మక్క జాతర భక్తులు ముందుగా వేములవాడకు వచ్చే మొక్కులు చెల్లించుకుంటారు. వీరి కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కావడంతో భీమన్న ఆలయంలో దర్శనాలు, మొక్కులు కొనసాగిస్తున్నారు. దీంతో సమ్మక్క జాతర సందర్భంగా డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే భక్తుల రద్దీకి అనుగుణంగా పనులు మొదలుపెట్టారు. భీమన్న ఆలయంలో దర్శనాల కోసం పార్వతీపురం వసతి గదుల బ్యాక్‌సైడ్‌లోని వీఐపీ రోడ్డుపై క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. రాజేశ్వరపురం వద్ద పాత ఎస్‌బీహెచ్ బ్రాంచ్ ఉన్న ప్రాంతంలో కల్యాణకట్ట, షవర్ల ఏర్పాటుకు పనులను ముమ్మరం చేశారు. నటరాజ్ విగ్రహం వద్ద ఫ్‌లై ఓవర్, భీమన్న ఆలయంలో ఎగ్జిట్, ఎంట్రీ, వీఐపీ దర్శనాల క్యూలైన్, ఆశీర్వచన మండపం పనులు చేపడుతున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందికి అదనంగా మరో 12 మందిని కేటాయించారు. హోంగార్డులకు షిఫ్టులవారీగా విధులు కేటాయిస్తున్నారు. సీసీ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
సమ్మక్క జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్ 10 నుంచి సమ్మక్క జాతర భక్తుల రద్దీ ప్రారంభమవుతుందనే అనుకుంటున్నాం. అందుకు తగినట్లుగానే పనులు పూర్తి చేయిస్తాం. త్వరలోనే ఈ–టికెట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తాం.
– రమాదేవి, ఆలయ ఈవో
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు


