ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దాం
● రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి ● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. 1800 233 1495 నంబరు అందుబాటులో ఉంటుందని వివరించారు. పోటీ చేసే అభ్యర్థులు నూతనంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని, నామినేషన్ పత్రాలలో పూర్తి సమాచారం నింపాలని సూచించారు. తహసీల్దార్ నుంచి ప్రచార వాహనాల అనుమతి, పోలీసుల నుంచి లౌడ్‌స్పీకర్, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలన్నారు. నామినేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి జిల్లా పౌర సంబంధాల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
మార్గదర్శకాలను నోడల్ అధికారులు పాటించాలి
నోడల్ అధికారులు తమ విధులపై అవగాహన కలిగి ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు అర్థం చేసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీవో షరీఫోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.


