ఆకాశమే హద్దుగా ముందుకెళ్లాలి
పేదలు మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రూ.8.12 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ
సిరిసిల్ల: మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా సీఎం ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పేదలు మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి కింద 8,871 ఎస్‌హెచ్‌జీలకు రూ.8.12 కోట్ల చెక్కులను వేములవాడ, కలెక్టరేట్‌లో వేర్వేరుగా మంగళవారం పంపిణీ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 7,802 ఎస్‌హెచ్‌జీలకు రూ.7.40 కోట్లు, రెండో విడతలో 8,552 ఎస్‌హెచ్‌జీలకు రూ.11.78 కోట్లు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు రూ.100 కోట్ల చెల్లింపులు
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.100.10 కోట్లు ఆర్ధిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. శ్రీమహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతిశ్రీ కింద జిల్లాలో 1.14 లక్షల చీరలు పంపిణీ చేశామన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, సన్నబియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. వేములవాడ ఆలయాన్ని రూ.150కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ మహిళల ఉన్నతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రతీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను భాగస్వాములను చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతు పనులు, వసతుల కల్పనను అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నట్లు గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాలు, ఇతర వ్యాపారాలకు అవకాశం కల్పించిందని తెలిపారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు వి.స్వరూపారెడ్డి, విజయ, సాబేర బేగం, రాణి, చైర్మన్లు రాములు నాయక్, తిరుపతి, రాజు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఆర్డీఓ రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


