మూలకుపడ్డ రిక్షాలు
● వృథా అవుతున్న నిధులు ● పట్టించుకోని జీపీ సిబ్బంది ● ఇప్పటికే కొన్ని దొంగలపాలు
చందుర్తి(వేములవాడ): స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గతంలో గ్రామపంచాయతీలకు అందజేసిన చెత్త సేకరణ రిక్షాలు నిరుపయోగంగా మారాయి. మొదట్లో చెత్తసేకరించగా.. అనంతరం గ్రామపంచాయతీకో ట్రాక్టర్‌ను కొనుగోలు చేయడంతో ఈ రిక్షాలు మూలకుపడ్డాయి. అప్పటి నుంచి వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతుంది.
జనాభా ఆధారంగా రిక్షాలు
జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలలో జనాభా ఆధారంగా చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు రిక్షాలు వచ్చాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించకముందే గ్రామపంచాయతీకో ట్రాక్టర్ చొప్పున కొనుగోలు చేయడంతో వీటిని పట్టించుకునే వారు లేరు. ట్రాక్టర్లలో చెత్త సేకరణ సులభంగా ఉండడంతో రిక్షాలను మూలకుపడేశారు. దీంతో గ్రామాల్లోని రిక్షాలు నిరుపయోగంగా మారాయి. చందుర్తి మండలం నర్సింగపూర్‌లోని చెత్తా రిక్షాలను నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం వెనుక... చెత్తకుప్పల్లో పడేశారు. మండలంలోని బండపల్లిలో రిక్షాల సీట్లు, చక్రాలను ఎత్తుకెళ్లారు. మర్రిగడ్డ, మల్యాల, లింగంపేట గ్రామాల్లో ఎక్కడికక్కడే వదిలేశారు.
మరమ్మతు చేయించుకోవచ్చు
జీపీలకు ట్రాక్టర్లు వచ్చాక రిక్షాలు వినియోగించడం లేదు. కానీ ఇరుకు గల్లీల్లో తిరిగేందుకు రిక్షాలే నయం. ఏ గ్రామంలోనైనా ట్రాక్టర్ వెళ్లని వీధులు ఉంటే రిక్షాలు బాగు చేసుకొని వాడుకోవచ్చు. పూర్తిగా తుప్పుపడితే స్క్రాప్ కింద విక్రయించి, వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీలో జమచేసుకునేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటాం.
– బండి ప్రదీప్‌కుమార్,
మండల పంచాయతీ అధికారి, చందుర్తి
మూలకుపడ్డ రిక్షాలు


