తాగి వాహనాలు నడపొద్దు
● బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు ● గీత దాటితే కఠిన చర్యలు ● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల క్రైం: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని, మద్యం మత్తులో వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 3,740 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పెట్రోలింగ్‌ను పకడ్బందీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెట్రోకార్స్, బ్లూకోల్ట్ టీమ్‌లతో నిఘా కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీ, డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడు నెలల్లో డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో 10,980 మంది పట్టుబడగా.. జరిమానాలతోపాటు 260 మందికి శిక్షలు కూడా పడినట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయడానికి రవాణా శాఖకు సిఫారసు చేస్తున్నట్లు హెచ్చరించారు. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు.


