ఊరు.. పోరు షురూ
జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్లు
వార్డు సభ్యుల స్థానాలు
పోటీకి యువకుల సన్నద్ధం
● గ్రామాల వారీగా ‘రిజర్వేషన్ల’ గెజిట్ జారీ ● ఎస్టీలకు 30, ఎస్సీ 53, బీసీ 56, జనరల్‌కు 121 గ్రామాలు ● 119 స్థానాలు మహిళలకు కేటాయింపు ● తుది ఓటర్ల జాబితా వెల్లడి ● పల్లె ఓటర్లు 3,53,351 మంది
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 260 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల గెజిట్‌ను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ జారీ చేశారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాకు తుది రూపమిచ్చారు. ఈ మేరకు జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.
బీసీల్లో నిరాశ
జిల్లాలోని 260 గ్రామపంచాయతీల్లో ఈసారి కేవలం 56 గ్రామాలు బీసీలకు రిజర్వు చేయబడ్డాయి. అదే 42 శాతం ప్రకారం.. సెప్టెంబరు నోటిఫికేషన్‌లో 109 గ్రామాలను బీసీలకు కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలో బీసీలకు రిజర్వేషన్లలో నిరాశ ఎదురైంది. 2019 నాటి రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకుని 50 శాతం దాటకుండా కేటాయించడంతో బీసీలు నిరాశకు లోనయ్యారు. అలాగే వార్డు సభ్యుల స్థానాల్లోనూ ప్రస్తుతం బీసీలకు 553 స్థానాలను కేటాయించారు. కానీ, సెప్టెంబరు నోటిఫికేషన్ ప్రకారం 952 వార్డు సభ్యుల స్థానాల్లో బీసీలకు అవకాశం లభించింది. రిజర్వేషన్ కోటా తగ్గడంతో బీసీల స్థానాలు తగ్గి జనరల్ స్థానాలు పెరిగాయి. వీర్నపల్లి మండలంలో 17 గ్రామాలు ఉండగా, ఒక్క స్థానం కూడా బీసీలకు కేటాయించకపోవడంపై బీసీ జనాభా ఉన్న గ్రామస్తులు అభ్యంతరం చెబుతున్నారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ఈ సమస్య ఎదురైందని అధికారులు చెబుతున్నారు.
మహిళా ఓటర్లే అధికం
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,53,351 మంది కాగా.. ఇందులో మహిళలు 1,82,559, పురుషులు 1,70,772, ఇతరులు 20 మంది ఉన్నారు. పురుషుల కంటే 11,787 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోని 260 గ్రామపంచాయతీలకు గాను 119 స్థానాల్లో మహిళా సర్పంచ్‌లు ఎన్నిక కానున్నారు. 2,268 వార్డు సభ్యుల స్థానాల్లో మహిళలు 976 మంది ఎన్నికయ్యే చాన్స్ వచ్చింది.
మొత్తం గ్రామపంచాయతీలు 260
ఎస్టీ 30 (మహిళ 13, జనరల్ 17)
ఎస్సీ 53 (మహిళ 24, జనరల్ 29)
బీసీ 56 (మహిళ 24, జనరల్ 32)
జనరల్ 121(మహిళ 58, జనరల్ 63)
మొత్తం 2,268
ఎస్టీ 229 (మహిళ 106, జనరల్ 123)
ఎస్సీ 442 (మహిళ 177, జనరల్ 265)
బీసీ 553 (మహిళ 222, జనరల్ 331)
జనరల్ 1,044 (మహిళ 471, జనరల్ 573)
ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. 260 గ్రామాల్లో కలిసొచ్చే రిజర్వేషన్లను వినియోగించుకుని గ్రామస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సామాజిక సమీకరణను అంచనా వేస్తూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు సర్పంచ్‌గా అవకాశం రానివారు వార్డు సభ్యుడిగా ఎన్నికై .. ఉప సర్పంచ్‌గా విజయం సాధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో వార్డులను వెతుక్కుంటున్నారు. వార్డు సభ్యుడి స్థానంలో విజయం సాధించడంతో మెజార్టీ సభ్యులను గెలిపించుకుని పంచాయతీలో జాయింట్ చెక్‌పవర్ ఉన్న ఉపసర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. కాగా, గ్రామాల్లో తుది ఓటర్ల జాబితా వెల్లడించడం, వార్డు స్థానాలతో పాటు, గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను వెల్లడించడంతో పల్లె పోరుకు తెరలేచింది.


