కలెక్టర్ సెలవు పొడిగింపు
సిరిసిల్ల: కలెక్టర్ ఎం.హరిత తన దీర్ఘకాలిక సెలవును పొడిగించారు. అక్టోబరు 22న సెలవుపై వెళ్లిన కలెక్టర్ సోమవారం విధులకు రావాల్సి ఉంది. కానీ ఆమె తన సెలవులను డిసెంబరు 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన గరిమా అగ్రవాల్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో వచ్చే చాన్స్ ఉన్న నేపథ్యంలో కలెక్టర్ హరిత జిల్లాకు వస్తారా..? సెలవులోనే ఉంటారా.! అనే చర్చ జిల్లా అధికార వర్గాల్లో సాగుతుంది. జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన హరిత నెల రోజుల్లోనే దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు.
ఈ– శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
సిరిసిల్ల: జిల్లాలోని భవన నిర్మాణ, ఇతర రంగాల్లోని కార్మికులు ‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ కోరారు. కార్మిక శాఖ రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. ‘ఈ–శ్రమ్’ పోర్టల్‌లో చేరినవారికి సహజ, ప్రమాద మరణం దరి చేరినా.. అంగవైకల్యం కలిగినా బీమా సదుపాయం ఉంటుందన్నారు. డిసెంబరు 3 వరకు కార్మికులకు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డీఆర్డీవో శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు రూ.8.12 కోట్లు
సిరిసిల్ల: జిల్లాలోని 8,871 స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు ఇందిరా మహిళా శక్తి కింద వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. మహిళా సంఘాలకు రూ.8.12 కోట్లు మంగళవారం సిరిసిల్ల, వేములవాడల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ అధికారులతో సోమవారం సమీక్షించారు. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడతలో 7802 ఎస్‌హెచ్‌జీలకు రూ.7.40 కోట్లు, రెండో విడతలో 8552 ఎస్‌హెచ్‌జీలకు రూ.11.78 కోట్లు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందని వివరించారు. వేములవాడలోని రామలింగేశ్వర గార్డెన్‌లో వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్‌లో సిరిసిల్ల నియోజకవర్గ మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీపీఎంలు పాల్గొన్నారు.
కులగణన ఆపరేటర్ల వేతనాలు ఇవ్వాలి
సిరిసిల్లటౌన్: కులగణన సర్వే ఆపరేటర్ల వేతనాలు ఎప్పుడు అందిస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్లలోని కార్మిక భవనంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అట్టహాసంగా కులగనన చేపట్టిందని, అనంతరం పార్టీకి మంచి పేరు వచ్చిందన్నారు. కానీ, కులగణలో పాల్గొన్న నిరుద్యోగ యువతకు ఇప్పటివరకు వారికి రావాల్సిన డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా నుంచి నిరుద్యోగ యువత సుమారు 400 మంది నెల రోజులు శ్రమించినారని, వారికి డబ్బులు ఇవ్వకపోవడం సరికాదన్నారు. సమావేశంలో వెంటనే చెల్లించాలని లేకుంటే పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సెలవు పొడిగింపు
కలెక్టర్ సెలవు పొడిగింపు


