అరచేతిలో ‘మీ సేవ’లు
● వాట్సాప్ ద్వారా అందుబాటులోకి.. ● సులభతరం చేస్తూ ప్రభుత్వ నిర్ణయం
గంభీరావుపేట(సిరిసిల్ల): పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అవసరమైన సేవలు, సర్టిఫికెట్లను త్వరగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో శ్రీమీ సేవలుశ్రీను ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అధికారిక వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపితే చాలు అభ్యర్థన నమోదు నుంచి స్టేటస్ చెక్ వరకు అన్నీ మొబైల్‌లోనే పూర్తికానున్నాయి. పౌరసేవలను ప్రజల అరచేతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా పరిపాలనలో మరో ముందడుగుగా నిలుస్తోంది. డిజిటల్ తెలంగాణ దిశగా సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ప్రజలకు మరింత భరోసా కలిగించేలా ఉంది.
ప్రస్తుతానికి 35.. రానున్న కాలంలో 580 సేవలు
ఉన్నత చదువులకో.. ఉద్యోగాలకో.. విద్యాసంస్థల ప్రవేశాలకో అవసరమైన సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి మీసేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదు. దాదాపు 35 సేవలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రానున్న కాలంలో మొత్తం 580 సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జనన, మరణ, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు విద్యుత్ బిల్లులు, ట్యాక్స్‌లు చెల్లించే వీలు కలిగింది. అధికారిక వాట్సాప్ నంబర్ 80969 58096ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సులభతరం.. వేగవంతం
ప్రస్తుతం మీసేవలలో ఉన్న పలు సర్టిఫికెట్లు, అప్లికేషన్లు, ఫిర్యాదులు ఇవన్నీ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో ప్రజల వినియోగ శైలిలో మార్పు రావడంతో, ప్రభుత్వం వాట్సాప్‌ను కూడా అధికారిక సేవా వేదికగా మార్చింది. ఇంటర్నెట్ ఉన్న ఏ సాధారణ మొబైల్‌లోనైనా తక్షణం ఉపయోగించుకునే వీలు కలిగించింది.
వాట్సాప్ ద్వారా ఏం చేయొచ్చు
– కొత్తగా దరఖాస్తు, అవసరమైన పత్రాల అప్‌లోడ్ చేయడం, అప్లికేషన్ ఫీజు చెల్లించడం, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం, పూర్తి వివరాలు, మార్గదర్శకాలు పొందడం, ఫిర్యాదులు, సూచనలు పంపడం వంటివి చేయొచ్చు.


