నేతన్నల నైపుణ్యానికి ప్రతీక చీరలు
ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్లలో ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ
సిరిసిల్ల: నేతన్నల నైపుణ్యానికి ఇందిరా మహిళాశక్తి చీరలు ప్రతీక అని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణ వసతిని కల్పించారని, ఇందిరమ్మ ఇండ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరిట స్కూళ్లలో వసతులు కల్పించే పనులు మహిళలకు అప్పగించారన్నారు. ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ చీరలతో స్థానికంగా ఉన్న 130 మ్యాక్స్ సొసైటీలకు, 6 వేల మంది కార్మికులకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కె.కె.మహేందర్‌రెడ్డి, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్‌పర్సన్లు వెల్ముల స్వరూపారెడ్డి, విజయ, సాబేరబేగం, రాణి, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్‌బేగం పాల్గొన్నారు.


