పొత్తూరు వరకు రోడ్డు నిర్మించాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని పొత్తూరు గ్రామస్తులు మానేరువాగు బ్రిడ్జిపై శనివారం ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పొత్తూరు వరకు డబుల్ రోడ్డు కోసం రూ.77కోట్లు మంజూరు చేశారని ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయన్నారు. నిధులు లేవని గన్నేరువరం వరకే రోడ్డు వేస్తామనడం అన్యాయమన్నారు. సిద్ధం శ్రీనివాస్, అశ్విని శ్రీనివాస్, గుంటి ఆంజనేయులు, బండారి మహేశ్, రోడ్ల కరుణాకర్‌రెడ్డి, పట్నం మహేందర్, సతీశ్, తిరుమల్, అభి, సన్నీ పాల్గొన్నారు.
రేపటి నుంచి మాస్టర్‌ప్లాన్ సర్వే
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో అమృత్ 2.0 సర్వే నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా తెలిపారు. 39 వార్డుల పరిధిలో ఈనెల 24 నుంచి 30 వరకు సిబ్బంది ఇంటింటా విచారణ చేపడతారని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చేసే సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ముస్తాబాద్: మండలంలోని నామాపూర్ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన హార్థిక రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పీడీ శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్లుల్లలో 69వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారన్నారు. ఉమ్మడి జిల్లాస్థాయిలో జరిగిన అండర్–17 పోటీల్లో హర్థిక ప్రతిభ కనబర్చిందన్నారు. యాదాద్రి భువనగిరిలో జరిగే పోటీలకు హర్థిక ఎంపికడంపై హెచ్‌ఎం సుధాకర్, టీచర్లు అభినందించారు.


