ధర్మయుద్ధం గెలిచాం
సిరిసిల్లటౌన్: బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై బీజేపీ చేపట్టిన ధర్మయుద్ధం గెలిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌పై అక్రమంగా పెట్టిన పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టివేయడంతో గురువారం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అంబేడ్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ అధర్మంగా బీజేపీ నాయకులపై పెట్టించిన కేసులు ధర్మయుద్ధంతో గెలుస్తామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్గత విభేదాలపై డీఈవో ఆరా!
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సిబ్బంది మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు ఆ శాఖ ఉన్నతాధికారి చర్యలుకు ఉపక్రమించినట్లు తెలిసింది. జిల్లా స్థాయి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మధ్య సయోధ్య లేకపోవడంపై సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. డీఈవో కార్యాలయంలో గురువారం పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ.. ‘మనమే సమయానికి వచ్చి, పని చేసుకుని వెళ్లాలి. అనవసర చర్చలు, విభేదాలు అవసరం లేదు’ అన్న భావన కనిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిబ్బంది మధ్య సమన్వయం కోసం అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.


