పత్తి రైతులకు ఇబ్బంది రానీయొద్దు
● ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని పత్తి రైతులకు ఇబ్బందులు రానీయొద్దని, పత్తి పంటను విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు సమ్మె ప్రారంభిస్తున్నట్లు తెలియజేసిన నేపథ్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించారు. సమ్మెతో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మిల్లుల యాజమాన్యాన్ని, మార్కెటింగ్, వ్యవసాయ, సీసీఐ అధికారులను ఆదేశించారు. ఏఎస్పీ చంద్రయ్య, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, సీసీఐ సీపీవో రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): అల్లింకో, ఏడీఐపీ, ఆర్‌వీఐ ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీకి నిర్వహిస్తున్న శిబిరాన్ని దివ్యాంగులు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. దివ్యాంగుల పట్ల ఇతరులు వివక్ష చూపవద్దని, అందరితో సమానంగా గౌరవించాలన్నారు. తన తండ్రి కూడా ఒక చేతిలేని అంగవైకల్యుడేనని, తను ధైర్యంగా క్రికెట్ ఆడుతారని, సైకిల్ తొక్కుతారని పేర్కొన్నారు. అనంతరం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరగా ఇళ్లు పూర్తి చేయాలని, అవసరమైతే రుణాలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన సమాచారం అడిగిన వెంటనే పూర్తిస్థాయిలో అధికారులు అందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సీడీపీవో ఉమారాణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రవిశంకర్, ఎంపీడీవో శశికళ, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


