భీమన్న ఆలయంలో కొనసాగుతున్న పనులు
సిద్ధమైన క్యూలైన్లు.. ప్రసాదాల షెడ్డు
పడమర వైపు వీఐపీ గేట్
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చకచక కొనసాగుతున్నాయి. రాజన్న ఆలయంలో ప్రహరీ తొలగింపు, రేకులషెడ్ల కూల్చివేతలు కొనసాగుతుండగా.. భీమన్న ఆలయంలో క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్ల పనులు దాదాపు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి. వీఐపీలు వచ్చేందుకు పడమర వైపు ప్రత్యేక గేట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పార్వతీపురం వసతిగదుల వెనుక భాగం నుంచి క్యూలైన్ల పనులు చేస్తున్నారు.
వేదపాఠశాలలో ప్రసాదాల కౌంటర్లు
భీమన్న ఆలయం ఎదుట గల వేదపాఠశాల భవనం ఆవరణలో ప్రసాదాల కౌంటర్ల కోసం ప్రత్యేక షెడ్డు నిర్మించారు. త్వరలోనే ఇక్కడే ప్రసాదాలను తయారు చేయనున్నారు. విక్రయాలు సైతం మొదలుకానున్నాయి.
భీమన్నగుడిలో వీఐపీ ప్రవేశద్వారం
కార్తీకమాసం కొనసాగడం, సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా వచ్చే వీఐపీలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసేందుకు ఆలయ అధికారులు పనులు చేపడుతున్నారు. భీమన్నగుడికి పడమర వైపు ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా వీఐపీలను లోపలికి తీసుకొచ్చి దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ రోడ్డు పక్కనే ఆశీర్వచన మండపం ఏర్పాటు చేయనున్నారు.
మున్సిపల్ స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు
భీమన్నగుడి ప్రహరీని ఆనుకుని ఉన్న మున్సిపల్ స్థలంలో ఆలయ అధికారులు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసేందుకు శనివారం భూమిపూజ చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్, ఇతర అవసరాల కోసం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పనులు చక చకా


