
శత్రుత్వం వారసత్వం కాకూడదు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ
సిరిసిల్లకల్చరల్: కక్షిదారుల మధ్య ఏర్పడ్డ అంతరాలు, ఆస్తి వివాదాలు తర్వాతి తరాలకు విస్తరించకుండా జాగ్రత్తపడాలని, శత్రుత్వం వారసత్వంగా సంక్రమించకూడదని జిల్లా ప్రదాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. సిరిసిల్ల కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోర్టు మెట్లెక్కి వివాదాలను రచ్చ చేసుకోవడం కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, న్యాయమూర్తులు బి.పుష్పలత, లక్ష్మణాచారి, ప్రవీణ్, కె.సృజన, గడ్డం మేఘన, అదనపు ఎస్పీ చంద్రయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ న్యాయవాదులు గుర్రం ఆంజనేయులు, ఆడెపు వేణు, సభ్యుడు చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.
18,208 కేసుల పరిష్కారం
జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 18,208 కేసులను పరిష్కరించారు. రూ.3,06,77,036 విలువైన పరిహారాలను కక్షిదారులకు ఇప్పించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. ప్రమాద కేసులు 6, సివిల్ తగాదాలు 7, క్రిమినల్ 284, ఎకై ్సజ్ 18, చెక్‌బౌన్స్ 13, కుటుంబ తగాదాలు 11, సైబర్‌నేరాలు 80, బ్యాంకు 141, బీఎస్‌ఎన్‌ఎల్ 25, డ్రంకెన్‌డ్రైవ్ 2,384, ట్రాఫిక్ చలానా కేసులు 15,239 పరిష్కరించారు.
వేములవాడ: చిన్నపాటి సమస్యలతో సమయం వృథా చేసుకోకుండా, రాజీ పడేందుకు సులువైన మార్గమమే లోక్‌అదాలత్ అని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్‌జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ కోర్టులో లోక్ అదాలత్‌లో పాల్గొన్నారు. 799 కేసులలో రూ.30లక్షల విలువైన పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ మెంబర్ నేరెళ్ల తిరుమల్‌గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఏజీపీ బొడ్డు ప్రశాంత్, అడ్వకేట్లు గుడిసె సదానందం, పిట్టల మనోహర్, మహేశ్‌గౌడ్, రమేశ్, శ్రీనివాస్, సంపత్, నర్సింగారావు, అంజయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు.