
అర్హులకు ‘చేయూత’నందించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: అర్హులకు చేయూత పెన్షన్లు అందించాలని, క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో గురువారం చేయూత పెన్షన్లపై పీపీటీ ద్వారా సెర్ప్ డైరెక్టర్ గోపాల్ మార్గదర్శకాలు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు పింఛన్ తీసుకుంటున్న వారు మరణిస్తే వారి స్థానంలో జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయాలని, హెచ్‌ఐవీ, డయాలసిస్ పింఛన్ పోర్టల్ ఓపెన్ ఉందన్నారు. ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్ సంబంధించి రెండు రిజిస్టర్లు మెయింటెన్ చేయాలని సూచించారు. ఒక రిజిస్టర్‌లో పింఛన్‌దారుల వివరాలు, మరో రిజిస్టర్‌లో అర్హత ఉన్న వారి వివరాలు రాయాలని తెలిపారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఆరు నెలల్లోపు మాత్రమే పంచాయతీ కార్యదర్శులు జారీ చేయాలని, ఆరు నెలల తర్వాత రెవెన్యూ డివిజన్ అధికారికి మాత్రమే ఆ హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్‌ఎఫ్‌బీఎస్‌ను అర్హులకు అందించాలి
నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం(ఎన్‌ఎఫ్‌బీఎస్) అర్హులైన పేదలకు అందించాలని సూచించారు. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల వారు నిరుపేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఒకేసారి రూ.20వేల సహాయం అందుతుందని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు, నేతన్న కుటుంబాలలో ఈ పథకానికి అర్హులుంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. డైరెక్టర్ సెర్ప్ గోపాల్, డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, అన్వేశ్, డీఎల్‌పీవో నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఏఐ టూల్స్‌పై శిక్షణ ఇవ్వాలి
వేములవాడఅర్బన్: విద్యార్థులకు ఏఐ టూల్స్‌పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగది, స్టోర్‌రూమ్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన భోజనాన్ని పరిశీలించారు. విద్యాలయం ఆవరణను శుభ్రంగా చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.