
నా‘నో’ అనకండి
ముస్తాబాద్(సిరిసిల్ల): యూరియా కొరత వేధిస్తున్న వేళ రైతులు నిత్యం ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. అయినా వారికి యూరియా బస్తాలు దొరకడం లేదు. అదృష్టముంటే ఒక్క బస్తా.. లేదంటే నిరాశే. యూరియా బస్తాల కోసం క్యూలో గంటలకొద్దీ నిల్చుంటున్న రైతులు అదే దుకాణంలో ఉన్న నానో యూరియా బాటిళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. యూరియా బస్తాల స్థానంలో నానో యూరియా వాడవచ్చని అధికారులు చేస్తున్న ప్రచారం, అవగాహన కార్యక్రమాలకు రైతులకు చేరకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అసలు నానో యూరియా అనేది ఉన్నట్లు రైతులకు తెలవకపోవడం చర్చించుకోవాల్సిన విషయం.
ఖర్చు తక్కువే..
నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. డ్రోన్‌తో పిచికారీ చేయవచ్చు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలపై నానో యూరియాతో పురుగుల మందు, పొటాష్‌ను కలిపి పిచికారీ చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. వరికి మొదటి డోస్‌గా గుళికల యూరియా, రెండో డోస్‌గా నానో యూరియా వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నానో యూరియా బాటిల్ రూ.225కు లభిస్తుండగా, పిచికారీ చేసేందుకు ఎకరానికి డ్రోన్‌కు అద్దె రూ.350 తీసుకుంటున్నారు. అయితే గుళికల యూరియా చల్లితే రైతుకు డ్రోన్ ఖర్చు కలిసొస్తుంది. గుళికల యూరియా కోసం గోదామ్‌ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. అదే నానో యూరియాకు అవసరం లేదు. నానో యూరియాతో పంట దిగుబడి పెరగడంతోపాటు నీరు, గాలి, నేల కాలుష్యం కాదు.
అందుబాటులో నానో యూరియా
ముస్తాబాద్, పోతుగల్, గంభీరావుపేట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, ఇల్లంతకుంట, సిరిసిల్ల మండలాల్లోని ప్రాథమిక వ్యవసాయ సంఘాలలో నానో యూరియా బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇఫ్కో ద్వారా వాహనాలు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఎకరానికి రూ.350 అద్దెతో డ్రోన్లు అందిస్తారు.