
ప్రముఖ విద్యాలయంగా శాతవాహనకు గుర్తింపు
● వీసీ ఉమేశ్‌కుమార్
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగిందని వివరించారు. ఆగస్టు 17 నుంచి 31 వరకు వీసీ అమెరికా పర్యటన వివరాలు బుధవారం వెల్లడించారు. భిన్న కోర్సులతో నాలుగు పీజీ సెంటర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్‌ఆర్‌ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాలు సందర్శించి విరాళాలు సేకరించినట్లు తెలిపారు. 8 బంగారు పతకాలతోపాటు రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు వివరించారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. నవంబర్ రెండో వారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కొనసాగుతున్న పోలీస్ పికెట్
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని వెంకట్రావుపల్లిలో పోలీస్ పికెట్ బుధవారం సైతం కొనసాగిందని ఎస్సై గణేశ్ తెలిపారు. అసైన్డ్ భూములు ఐకేపీ కొనుగోలు కేంద్రానికి కేటాయించాలని గ్రా మస్తులు ఆందోళన చేపట్టారన్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన 13 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.