
ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో ఉండాలి
● సైకాలజిస్టు పున్నంచందర్ ● నర్సింగ్ కళాశాలలో వర్క్‌షాప్
సిరిసిల్లటౌన్: యువత మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యలకు పాల్పడొద్దని పలువురు వక్తలు కోరారు. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మెండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెంటల్ హెల్త్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ బి.ప్రవీణ్‌కుమార్, సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ మాట్లాడారు. కుటుంబ సభ్యులు, స్నేహితులలో కలిగే ప్రవర్తన మార్పులు, ఉద్వేగ మార్పులను గమనించి సాంత్వన కలిగించే మాటలతో ధైర్యం చెప్పాలన్నారు. అవసరమైతే సైకాలజిస్ట్‌లను, సైకియాట్రిస్ట్‌లను కలిసి కౌన్సెలింగ్ ఇస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి బయటపడతారన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సి.అనురాధ, లెక్చరర్స్ సుజాత, స్వప్న, అరుణ, అరుణకుమారి, గ్లోరి, సంధ్యారాణి, హెల్పింగ్‌హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అల్వాల ఈశ్వర్ పాల్గొన్నారు.