
బారులు తీరినా బస్తానే!
ఒక్క బస్తాకు రెండు గంటల నిరీక్షణ ధర పెంచి అమ్ముతున్న వ్యాపారులు ఇప్పటికే ఓ ఎరువుల దుకాణదారుడి లైసైన్స్ రద్దు అయినా ఆగని దోపిడీ తీరని యూరియా కొరత
సిరిసిల్ల: జిల్లా రైతులకు యూరియా కొరత తీరడం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటే ఒక్క బస్తా అందుతుంది. అది కూడా ప్రైవేట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరిపంటకు నెల రోజుల్లోపే యూరియా అందాల్సి ఉంటుంది. జిల్లాలో వరినాట్లు పూర్తయి నెల రోజులు దాటుతోంది. ఈక్రమంలోనే అన్నదాతలు తమ పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం దుకాణాల వద్ద బారులుతీరుతున్నారు. జిల్లాలో ఇటీవల ఒక్కో యూరియా బస్తాను రూ.300లకు విక్రయిస్తే ఆ ఎరువుల దుకాణదారుడి లైసెన్స్‌ను వ్యవసాయశాఖ అధికారులు రద్దు చేశారు. కానీ ఏ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి అదే రూ.300కు ఒక్కో బస్తాను విక్రయిస్తున్నాడు. అధికారులు మాత్రం ఆ దుకాణం వైపు చూడడం లేదు. దీంతో ఆ వ్యాపారి ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగుతోంది.
క్యూలైన్‌లో రెండు గంటలు.. రైతుకు ఒకే బస్తా
సిరిసిల్ల పెద్ద బజారులో రెండు గంటలపాటు బారులు తీరితే ఒక్క బస్తా యూరియా ఇస్తున్నారు. అన్నదాతలు ఉదయం 6.30 గంటలకు క్యూలో నిల్చంటే 8.30 గంటలకు వారి వంతు వస్తుంది. అయితే 9 గంటల వరకు యూరియా అయిపోయిందంటూ వ్యాపారులు చేతులు ఎత్తేశారు. జిల్లా వ్యాప్తంగా 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(సింగిల్ విండో), లైసెన్స్ గల 253 ఎరువుల దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ఈ సీజన్‌లో 1,85,560 ఎకరాల్లో వరి, 46,205 ఎకరాల్లో పత్తి, 3,748 ఎకరాల్లో మొక్కజొన్న, 660 ఎకరాల్లో కందిపంట వేశారు. ఈమేరకు వ్యవసాయశాఖ యూరియాను జిల్లాకు తెప్పించగా రైతుల అవసరాలకు సరిపోలేదు. దీంతో రైతులు సహకార సంఘాల వద్ద బారులు తీరడం, చెప్పులు లైనులో పెట్టడం, యూరియా లారీ వస్తే మొత్తం బస్తాలు మాకే ఇవ్వాలంటూ ముట్టడించడం వంటివి జరుగుతున్నాయి. రైతుకు ఒక్క బస్తానే ఇస్తుండడంతో యూరియా సరిపోక మరుసటి రోజు కూడా ఆ రైతు దుకాణం వద్ద క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి. పెద్ద రైతులు మాత్రం ప్రైవేటు వ్యాపారుల వద్ద కాస్త ధర ఎక్కువ చెల్లించి యూరియాను దక్కించుకుంటున్నారు. చిన్న, సన్నకారులు రైతులు ఇబ్బందిపడుతున్నారు.
బఫర్ నిల్వలు పదిలం
జిల్లాలో రైతులకు అత్యవసరమైన పరిస్థితుల్లో అందించేందుకు పెద్దూరు శివారులోని అపెరల్ పార్క్ గోదాములో 140 మెట్రిక్ టన్నుల యూరియాను నిల్వ చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చొరవతో ఈ బఫర్ నిల్వలను ఉంచారు. ఇటీవల రైతుల అవసరాల మేరకు 40 మెట్రిక్ టన్నులను సరఫరా చేశారు. ప్రస్తుతం వంద మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. జిల్లాకు ఇప్పటి వరకు 15వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా.. మరో 10వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. సింగిల్‌విండోల ద్వారా 60 శాతం, ప్రైవేటు వ్యాపారులు 40 శాతం యూరియాను సరఫరా చేస్తున్నారు.
సమయం : సోమవారం ఉదయం 6.30 గంటలు
స్థలం : సిరిసిల్ల పెద్ద బజారు, ఎరువుల దుకాణం
సందర్భం : యూరియా బస్తాల కోసం రైతుల నిరీక్షణ
విశేషం : ఆధార్‌కార్డులతో వచ్చిన రైతులకు ఒక్క బస్తా ఇవ్వడం
ప్రత్యేకత : 45 కిలోల యూరియా బస్తా ధర రూ.267 ఉండగా రూ.300లకు విక్రయాలు
కొసమెరుపు : రవాణా, హమాలీ ఖర్చులు అని బుకాయింపు