వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం

Sep 9 2025 6:52 AM | Updated on Sep 9 2025 6:52 AM

వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం

వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం

● ప్రత్యేక క్యాంపస్‌ ఏర్పాటు చేయండి ● రోడ్డుపై బైటాయించిన జేఎన్టీయూ విద్యార్థులు

వేములవాడఅర్బన్‌: మౌలిక వసతులు లేవని, తమకు ప్రత్యేకంగా క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని జేఎన్టీయూ విద్యార్థులు సోమవారం సిరిసిల్ల–కరీంనగర్‌ రోడ్డుపై బైటాయించారు. వారు మాట్లాడుతూ వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల క్రితం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అధికారులు వసతుల కల్పనపై పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్లలో క్యాంపస్‌ ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తామని మాట తప్పారన్నారు. ఎనిమిది తరగతి గదులు మాత్రమే ఉన్నాయని, ల్యాబ్‌లు లేక వేరే చోటుకు తీసుకెళ్తున్నారన్నారు. కళాశాలలోని మెస్‌లో రద్దీ ఉంటుండడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె భవనంలోని హాస్టల్‌ సైతం కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉందన్నారు. గెస్ట్‌ ఫ్యాకల్టీతో బోధన చేయిస్తున్నారన్నారు. కాలేజీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక బ్యాచ్‌ వెళ్లిపోయిందని.. అయినా వసతులు కల్పించడం లేదన్నారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య, వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఎనిమిది మంది విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వదిలేశారు. వీరికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఏబీవీపీ, బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయింది.

ఠాణాలో విద్యార్థులకు సంఘీభావం

ఇంజినీరింగ్‌ విద్యార్థులను వేములవాడటౌన్‌ పోలీసులు ఠాణాకు తీసుకెళ్లడంతో చల్మెడ లక్ష్మీనర్సింహారావు వారికి సంఘీభావం ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇంజినీరింగ్‌ కాలేజీకి స్థలం కేటాయించినట్లు తమ నాయకుడు కేటీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం విద్యార్థులను ఠాణాకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సరిపడా తరగతి గదులు కేటాయించాలి

సిరిసిల్లఅర్బన్‌: అగ్రహారం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే సరిపడా తరగతి గదులు కేటాయించాలని ఎస్‌ఎప్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌ కోరారు. ఈమేరకు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఒకే భవనంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉండడంతో విద్యార్థులకు గదులు సరిపోవడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని జేఎన్టీయూకు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ సంజన, జిల్లా కమిటీ సభ్యులు శివ, విద్యార్థులు శ్రీనివాస్‌, కార్తీక్‌, మహేశ్‌, రమ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement