
ఇక.. రెవె‘న్యూ’ పాలన
సేవలు ఇలా..
● 118 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలు ● విధుల్లో చేరిన గ్రామపాలనాధికారులు
ముస్తాబాద్(సిరిసిల్ల): కాలానుగుణంగా రెవెన్యూ శాఖలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండగా.. దాని స్థానంలో వీఆర్వోలు వచ్చారు. వీఆర్వోల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారులను నియమించింది. ఐదేళ్లుగా గ్రామాల్లో రెవెన్యూ ప్రతినిధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్రామపాలనాధికారులు రావడం రెవెన్యూశాఖలో ఉన్నతాధికారులకు పనిభారం తగ్గించనుంది. క్షేత్రస్థాయిలో గ్రామస్తుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటా యనే ఆశాభావం వ్యక్తమవుతుంది. జిల్లాలో 118 రెవెన్యూ గ్రామాలుండగా.. ఒక్కో గ్రామానికి ఒక్కో రెవెన్యూ అధికారిని ప్రభుత్వం నియమించింది.
పటేల్ పట్వారీ నుంచి జీపీవో..
నిజాం పాలన నుంచి వచ్చిన పటేల్ పట్వారీ వ్యవస్థతో తెలంగాణ పల్లెల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేశారు. అప్పటి నుంచి 2003 వరకు గ్రామ కార్యదర్శియే రెవెన్యూ, పంచాయతీ వ్యవస్థలను చూసుకునేవారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వీఆర్వో వ్యవస్థను ప్రవేశపెట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థలో అవినీతి ఉందంటూ రద్దు చేసింది. మండల స్థాయిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్ మాత్రమే ఉన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వో స్థానంలో జీపీవోలను తీసుకొచ్చింది.
పథకాల అమలు, భూముల వ్యవహారాలు చూసుకోవడం.
ఆదాయం, కులం, నివాసం సర్టిఫికెట్ల జారీపై విచారణ. అనుమతులు.
ప్రభుత్వ ఆస్తుల రక్షణ. ప్రైవేటు భూముల నక్ష, పాస్‌బుక్కుల జారీపై విచారణ.
ప్రకృతి వైపరీత్యాలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం. బాధితులను ఆదుకునే చర్యలు చేపట్టడం.
వాల్టా చట్టం అమలుచేయడం.