
ఆదర్శం అచ్చన్నపల్లి
● ప్రైవేట్ స్కూళ్ల బస్సులు రాని ఊరు ● ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల ● పదేళ్లుగా ఏకతాటిపైన గ్రామస్తులు ● నాణ్యమైన భోజనం, విద్యాబోధన
వేములవాడరూరల్: ఉదయం జావ.. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం.. సాయంత్రం స్నా క్స్.. స్వచ్ఛమైన తాగునీరు.. నాణ్యమైన విద్యాబోధన.. ఇదంతా ప్రభుత్వ బడిలోనే. అవును గ్రామస్తులు ఏకమై తమ పిల్లలు ఊరు దాటి వెళ్లవద్దనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా డబ్బులు జమచేస్తూ ప్రైవేట్ టీచర్లను పెట్టి మరీ ప్రభుత్వ బడిని బతికించుకుంటున్నారు. వారే వేములవాడరూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామస్తులు.
57 మంది విద్యార్థులు
వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 57 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా.. గ్రామస్తులు ముందుకొచ్చి మరో నలుగురు ప్రైవేట్ టీచర్లను నియమించుకున్నారు. ఇందుకు పదేళ్ల క్రితం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు.
అందరూ రైతులే..
అచ్చన్నపల్లిలో గ్రామంలో 175 గృహాలు, 744 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ఉదయం పొలం పనులకు వెళ్తే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రారు. ఈక్రమంలో స్కూల్‌కు వెళ్లిన పిల్లలకు నాణ్యమైన ఇంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో కమిటీ ఆధ్వర్యంలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.8వేలు చొప్పున జమచేసుకుంటున్నారు. ప్రత్యేకంగా వంట మనుషులను ఏర్పాటు చేసి ఉదయం జావ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందజేస్తున్నారు. ఇలా ప్రతీ నెల రూ.40వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ ఖర్చంతా పిల్లల తల్లిదండ్రులే భరిస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు సైతం విద్యాబోధన చేస్తున్నారు. పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ అందించాలని స్కూల్ పక్కనే మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పిల్లలతోపాటు గ్రామస్తులు కూడా ఇక్కడి నుంచే ఉచితంగా శుద్ధనీటిని తీసుకెళ్తున్నారు.
ఏటా నవోదయకు ఎంపిక
ఈ పాఠశాలలో చదివే పిల్లలు ఏటా 5వ తరగతి పూర్తికాగానే నవోదయ పాఠశాలకు ఎంపికవుతున్నార. గత కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం నలుగురు నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికవుతున్నారు. అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం అదనపు గదులు, టీచర్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామస్తుల సహకారంతో...
ఈ పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థిపై గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మా స్కూల్‌కు ఎలాంటి లోటు రాకుండా ఎంతో సహకరిస్తున్నారు. ఈ గ్రామం నుంచి ప్రైవేటు బడులకు ఎవరూ పోరు.
– శ్రీనివాస్, హెచ్‌ఎం, అచ్చన్నపల్లి
పదేళ్లుగా ప్రైవేటుకు బంద్
మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకే మా పిల్లలను పంపిస్తా ము. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ చదువుకుంటారు. భోజనంతోపాటు అన్ని సౌకర్యాలను గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేస్తాం. గత పదేళ్లుగా మా గ్రామానికి ప్రైవేటు పాఠశాల వాహనాలు రావు. – దానె కొమురయ్య,
మాజీ సర్పంచ్, అచ్చన్నపల్లి

ఆదర్శం అచ్చన్నపల్లి

ఆదర్శం అచ్చన్నపల్లి

ఆదర్శం అచ్చన్నపల్లి