
తుప్పు పడుతున్నాయ్..
ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఐకేపీ అద్దె ట్రాక్టర్
ముస్తాబాద్(సిరిసిల్ల): సాగులో యాంత్రీకరణ ప్రవేశంతో పనులు సులభమయ్యాయి. ట్రాక్టర్లు, కల్టీవేటర్లతో పొలం పనులు వేగంగా పూర్తవుతున్నాయి. వీటిని కొనుగోలు చేసేంత ఆర్థిక స్థోమత లేని సన్న, చిన్నకారు రైతుల కోసం అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేందుకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని ఏడు మండలాల్లో అందుబాటులోకి తెచ్చారు. మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో ఉంచారు. వీటిపై అవగాహన లేని రైతులు వినియోగించుకోవడం లేదు. ఫలితంగా ఆ యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి.
అద్దెకు మిషిన్లు
మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, కేజీవీల్స్, కల్టీవేటర్లు, నాగళ్లను రైతులకు అద్దెకు ఇచ్చేందుకు మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయాల్లో ఉంచారు. ట్రాక్టర్‌కు రైతు నుంచి గంటకు రూ.వెయ్యి నుంచి రూ.1200 తీసుకోవాలి. కల్టీవేటర్‌కు రూ.200 నుంచి రూ.500 తీసుకుంటున్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, కోనరావుపేట మండల సమాఖ్యల్లో అద్దె వ్యవసాయ పనిముట్లను ఏర్పాటు చేశారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి. గడ్డి యంత్రాన్ని మాత్రం చాలా మంది రైతులు అద్దెకు తీసుకెళ్తున్నారు.
చోరీకి గురవుతున్న యంత్రాలు
మండల సమాఖ్య కేంద్రాల్లోని షెడ్లు, చెట్ల కింద ఉన్న ట్రాక్టర్లు, కల్టీవేటర్లు తుప్పుపడుతున్నాయి. గంభీరావుపేటలో చెట్టు కింద ఉన్న ట్రాక్టర్‌కు నిర్వహణ లేకుండా పోయింది. ముస్తాబాద్‌లో షెడ్డులో ఉన్న యంత్రాలు నాలుగు నెలల క్రితం చోరీకి గురయ్యాయి. ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన నెల రోజుల వరకు అధికారులకు తెలియలేదంటే అద్దె యంత్రాల నిర్వహణపై ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. తర్వాత పోలీసులు కేసును ఛేదించినప్పటికీ ట్రాక్టర్ ఠాణాలోనే తుప్పు పడుతుంది. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. తుప్పు పట్టి పనికిరాకుండా పోకముందే యంత్రాలను ఇతరులకు విక్రయిస్తేనైనా ఐకేపీకి నష్టాలు రావని పలువురు పేర్కొంటున్నారు.
అక్కరకు ఉపయోగపడని అద్దె యంత్రాలు
అన్నదాతలకు అవగాహన కరువు
వినియోగించుకోని రైతులు
కౌలురైతులకు ఉచితంగా ఇవ్వాలి
అద్దెకు యంత్రాలు ఇస్తారనే విషయమే తెలియదు. రైతులకు అవగాహన కల్పిస్తే వినియోగించుకుంటారు. కౌలురైతులకు ఉచితంగా ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు ఆలోచించాలి.
– మెరుగు అంజాగౌడ్, నామాపూర్
అవగాహన కల్పించాలి
ఐకేపీకి ప్రతీ గ్రామంలో నెట్‌వర్క్ ఉంది. ప్రతీ ఇంటి నుంచి మహిళలు ఐకేపీలో సభ్యులే. వారి ద్వారా రైతులకు అద్దె యంత్రాలపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది. వృథాగా ఉండి, యంత్రాలు తుప్పు పడితే మండల సమాఖ్యలకే నష్టం.
– శాడ శ్రీనివాస్, గూడెం
రైతులకు సమాచారం ఇస్తున్నాం
మండల సమాఖ్యలో ఉన్న అద్దె పనిముట్లపై రైతులకు గతంలోనే అవగాహన కల్పించాం. కొంతమంది ఉపయోగించుకున్నారు. ఎస్‌హెచ్‌జీలతో సమన్వయం చేసుకుని ట్రాక్టర్లకు అద్దెకు ఇస్తాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ముస్తాబాద్ ట్రాక్టర్ ప్రస్తుతం ఠాణాలో ఉంది. త్వరలో దానిని విడిపించి రైతులకు ఇస్తాం.
– దేవరాజు,
ఏపీఎం, ముస్తాబాద్

తుప్పు పడుతున్నాయ్..

తుప్పు పడుతున్నాయ్..

తుప్పు పడుతున్నాయ్..