
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్
సిరిసిల్లకల్చరల్: యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ.. బంగారు భవిష్యత్ కోసం విశ్రమించకుండా శ్రమించాలని సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సంజీవయ్యనగర్‌లోని సహస్ర జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు టీజింగ్, ర్యాగింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. న్యాయవాదులు ఆడెపు వేణు, గెంట్యాల భూమేశ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, కళాశాల నిర్వాహకుడు సిద్దిరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సోషల్ మీడియాపై నిఘా
● ఎస్పీ మహేశ్ బి గీతే
సిరిసిల్లక్రైం: అనుచిత వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా సోషల్‌మీడియాలో ప్రచారం చేసే మెసేజ్‌లపై నిఘా ఉంటుందని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. వాస్తవాలు గ్రహించకుండా అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఒక వర్గాన్ని, పార్టీని, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై సోషల్ మీడియా ట్రాకింగ్ విభాగం నిరంతరం నిఘా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. అవాస్తవాలను ప్రచారం చేసే వారి వివరాలను 87125 37826 నంబర్‌కు మెసేజ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రావణంలో ప్రత్యేక ఏర్పాట్లు
● ఈవో రాధాభాయి
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి ఆగస్టు 22 వరకు శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో రాధాభాయి గురువారం తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యే ఈనెల రోజులపాటు ప్రత్యేక సిబ్బంది, ప్రత్యేక క్యూలైన్లు, పూజారులకు విధులు కేటాయించినట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శానిటేషన్ పనులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటర్లు, ప్రసాదాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు.
ముసురుకున్న వర్షం
సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గురువారం ‘ముసురు’కుంది. వర్షపాత వివరాలు మిల్లీమీటర్లలో..చందుర్తి 50.6, రుద్రంగి 44.1, వేములవాడ రూరల్ 34.7, బోయినపల్లి 34.2, ముస్తాబాద్ 34.2, గంభీరావుపేట 32.9, ఇల్లంతకుంట 27.2, వేములవాడ 27, వీర్నపల్లి 22.8, తంగళ్లపల్లి 22.6, కోనరావుపేట 22.5, ఎల్లారెడ్డిపేట 20.8, సిరిసిల్ల 17.7 నమోదైంది.
అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తు గడువు పెంపు
సిరిసిల్లకల్చరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ఇన్‌చార్జి ఎస్సీడీవో రాజమనోహర్‌రావు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమెరికా, కెనడా, సౌత్‌కొరియా, జర్మ నీల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 19 నుంచి ఆగస్టు 31 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
దివ్యాంగులకు పునరావాసం
సిరిసిల్లకల్చరల్: దివ్యాంగులకు పునరావాస పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాకు 17 యునిట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. రూ.50వేల చొప్పున 14 యూనిట్లు, రూ.లక్ష యూనిట్ 80శాతం రాయితీ, రూ.2లక్షల యూనిట్ 70శాతం, రూ.3లక్షల యూనిట్ 60శాతం రాయితీతో ఒక్కొక్కటి మంజూరైందని వివరించారు. అర్హులైన దివ్యాంగులు tgobmms.cgg.gov.in లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి