
వరద..బురద
● చిన్న వర్షానికే తీరని వ్యథ ● పొంగిన డ్రైనేజీలు.. చిత్తడైన రోడ్లు ● విలీన గ్రామాలు అస్తవ్యస్తం
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్/వేములవాడ: వానాకాలం వచ్చిందంటేనే ఇటు సిరిసిల్ల ప్రజలు.. అటు వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాలవాసులు వణికిపోతున్నారు. చిరుజల్లులకే వరద ముంచెత్తుతుండడంతో భయాందోళన చెందుతున్నారు. డ్రెయినేజీలు పొంగిపొర్లుతుండడంతో వరదనీరు కాలనీలను ముంచెత్తుతోంది. వరద తగ్గిందని ఊపిరిపీల్చుకునేలోపు బురద వెంటాడుతోంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలోని వానాకాలం కష్టాలపై ఫోకస్.
సిరిసిల్లలో ఇలా..
ఒకప్పుడు ఊరి శివారులో ఉండే రాయించెరువు, తుమ్మలకుంట స్థలాల్లో పట్టణం విస్తరించింది. పై ప్రాంతం నుంచి వచ్చే వరద ఆయా ప్రాంతాల్లో నిలువకుండా వరదకాల్వలు లేకపోవడంతో వర్షాకాలంలో ముంపునకు గురువుతున్నాయి. చెరువుకట్టలను ఆనుకుని ఎన్నో నిర్మాణాలు జరిగాయి. ఈదులచెరువు, అర్జునకుంట, దేవునికుంట, మైసమ్మకుంట, దామరకుంటల స్థలాలు రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కొత్తచెరువు, కార్గిల్‌లేక్ కాల్వలు, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ లెవెల్ స్థలా లు కబ్జాకు గురవడంతోనే వరద ముంచెత్తుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
విలీన గ్రామాల్లో..
సిరిసిల్ల పట్టణ శివారుకాలనీలతోపాటు విలీన గ్రామాల్లో డ్రెయినేజీలు లేక ఇళ్లలో వాడుకున్న నీరంతా రోడ్లపైకి వస్తోంది. వర్షం నీరు ఇళ్ల మధ్య నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి నిల్వలతో దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయి. చంద్రంపేట, జ్యోతినగర్, కొత్తబస్టాండ్, రాజీవ్‌నగర్, ముష్టిపల్లి, పెద్దూరు, మాలపల్లి, బోనాల కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మరోవైపు రోడ్లు లేకపోవడంతో మట్టిరోడ్లు బురదమయంగా మారుతున్నాయి.
● వేములవాడ శివారు కాలనీల్లో వర్షపునీరు పేరుకుపోతుంది. డ్రెయినేజీ సిస్టమ్ సక్రమంగా లేకపోవడంతో వర్షం నీటితో వీధులు బురదమయంగా మారుతున్నాయి.
ఇది వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్. వర్షం పడితే స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారింది. వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. డ్రెయినేజీ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరంతా ఇండ్ల మధ్యలోనే నిలుస్తుంది.
ప్రణాళికలు రూపొందించాం
మౌలిక వసతుల కోసం ప్రణాళికలు రూపొందించాం. కాలనీల్లో మురుగునీటి పారుదల కోసం కొత్త డ్రెయినేజీలను నిర్మించబోతున్నాం. ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ నివారణకు ఎలివేషన్ ప్లానింగ్ చేస్తున్నాం. వీధుల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలతో పనులు చేయిస్తున్నాం. – అన్వేశ్,
మున్సిపల్ కమిషనర్, వేములవాడ
ఇది వేములవాడ శివారులోని మల్లారంరోడ్డులోని ఓ రెసిడెన్షియల్ కాలనీ. డ్రెయినేజీ లేకపోవడంతో మురికినీరు, వరదనీరు రోడ్డుపైన పారుతుంది. స్థానికులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే బురదలో నుంచి రావాల్సిందే.

వరద..బురద

వరద..బురద

వరద..బురద

వరద..బురద