
రైతులకు సరిపడా యూరియా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో యూరియా కొరత లేదని, అన్ని సహకార సంఘాల గోదాముల్లో రైతులకు సరిపడేంత అందుబాటులో ఉందని జిల్లా సహకార సంఘం అధికారి రామకృష్ణ పేర్కొన్నారు. మండలంలోని రాచర్లతిమ్మాపూర్, అల్మాస్‌పూర్, ఎల్లారెడ్డిపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోదాముల్లో నిల్వచేసిన యూరి యాను బుధవారం పరిశీలించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ సంఘానికి ఇప్పటి వరకు 445 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగిందన్నారు. ఎల్లారెడ్డిపేట పీఏసీఎస్ రెండు గోదాముల్లో 1524 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మండల వ్యవసాయాధికారి రాజశేఖర్ ఉన్నారు.
మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలి
● జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రామచంద్రం
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ చొప్పరి రామచంద్రం కోరారు. ఇల్లంతకుంటలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లు దాటిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలని కోరారు. మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎలవేని రమేశ్, డైరెక్టర్ కూనవేణి పరశురాములు, మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, కోఆర్డినేటర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ బంద్ సక్సెస్
సిరిసిల్లటౌన్: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైనట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంత్ తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖమంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జశ్వంత్, ఉస్మాన్, షాహిద్, యశ్వంత్, సిద్దు, సాయి, భార్గవ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఐటీఐలో రెండో విడత ప్రవేశాలు
సిరిసిల్లకల్చరల్: తంగళ్లపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో వివిధ ట్రేడ్‌లలో రెండో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కవిత ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోపు ఆసక్తి గల విద్యార్థులు https://iti.tela ngana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ మోటర్‌వెహికల్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫ్యాషన్ టెక్నాలజీతోపాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో సీఎన్‌సీ ఇంజినీరింగ్ డిజైనింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ రొబోటిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ ఇన్ ఆటోమేషన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, వర్చువల్ అనాలసిస్ డిజైనర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
పిల్లలను జాగ్రత్తగా చూడాలి
● సీఎంవో సెక్రటరీ సతీశ్
వేములవాడరూరల్: భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సీఎంవో సెక్రటరీ సతీశ్ పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలంలోని భవిత కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పిల్లలకు శిక్షణ ఇచ్చే మెటీరియల్‌ను పరిశీలించారు. పిల్లలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను, విద్యాప్రమాణాలను టీచర్ జయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఎంఈవో, సీసీవో రాంప్రసాద్, ఎంఐఎస్ మంగ, చైతన్య, నగేశ్ తదితరులు ఉన్నారు.

రైతులకు సరిపడా యూరియా

రైతులకు సరిపడా యూరియా