
మహిళా సంఘాలు వ్యాపారంలో రాణించాలి
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఎరువులు, విత్తనాల దుకాణాలు ప్రారంభం
బోయినపల్లి(చొప్పదండి): ఇందిరా మహిళాశక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేసిన మహిళలు వ్యాపారంలో రాణించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మండల కేంద్రంలో ధరిత్రి మహిళా సమాఖ్య, విలాసాగర్ గ్రామైఖ్య సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు–విత్తనాల దుకాణాలను గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళాశక్తి కింద మహిళా సంఘాలకు క్యాంటీన్లు, డెయిరీ యూనిట్, కోడిపిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సుల యూనిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ త్వరలో జిల్లాలో 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్‌బేగం, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఎంఏవో ప్రణిత, ఏపీఎం జయసుధ, సెస్ డైరెక్టర్ సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గుడ్ల సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
సిరిసిల్లకల్చరల్: వసతిగృహాల్లో కోడిగుడ్ల టెండర్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రకటించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా విద్యాధికారి, ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాల బాధ్యులు, పశుసంవర్ధకశాఖ అధికారులు సభ్యులుగా కమిటీని రూపొందిస్తామని తెలిపారు. గతేడాది అడ్మిషన్లకు అదనంగా మరో 10 శాతం విద్యార్థుల సంఖ్యను పెంచి ఇండెంట్ తయారు చేయాలని ఆదేశించారు. కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు ఉండాలని, నెలలో రెండుసార్లు సరఫరా చేయాలని పేర్కొన్నారు. డీఈవో వినోద్‌కుమార్, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, బీసీడీవో రాజమనోహర్‌రావు పాల్గొన్నారు.