
టెన్త్ విద్యార్థులకు రేపు సైకిళ్ల పంపిణీ
● హాజరుకానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
సిరిసిల్ల: జిల్లాలోని పదోతరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా మంగళవారం సైకిళ్లు పంపణీ చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. తాను వివిధ సంస్థల నుంచి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) నిధులతో సైకిళ్లు కొని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,841 మంది విద్యార్థులకు ముందుగా సైకిళ్లు ఇస్తామని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు అన్ని మండల కేంద్రాల్లోనూ 100 నుంచి 200 చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేయాలని, గ్రామాల్లో 25 నుంచి 50 వరకు అదనంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఈవో వినోద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి హాజరుకానున్నారు.
కరెంట్ కోసం రైతుల నిరసన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఒక వర్షాలు లేక.. మరోవైపు మూడు రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని అల్మాస్‌పూర్‌లో ఆదివారం రైతులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ మూడు రోజుల క్రితం పాడైందని, దానికి కింద 60 ఎకరాలు సాగుభూమి ఉందన్నారు. ఎకరానికి రూ.8వేలు పెట్టి దున్నించామని.. కరెంట్ లేకపోవడంతో పొలం ఎండిపోయిందని మళ్లీ దున్నుకోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయాలని రైతులు ఉచ్చిడి శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, నాగెల్లి రాజిరెడ్డి, పెద్దూరి శ్రీనివాస్, పెద్దూరి పర్శరాములు, మట్ట సత్తిరెడ్డి, దానవేణి పర్శరాములు, ఉచ్చిడి నారాయణరెడ్డి, చింతల్‌ఠాణ లచ్చయ్య కోరారు. దీనిపై సెస్ ఏఈ పృథ్వీధర్‌గౌడ్‌ను వివరణ కోరగా.. ఆదివారం సెలవు దినం కావడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయలేకపోయామని, సోమవారం ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఆర్టీసీ ఆధ్వర్యంలో దైవదర్శన టూర్
సిరిసిల్లటౌన్: స్థానిక డిపో నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆదివారం ఐదో బస్సును డీఎం ప్రకాశ్‌రావు ప్రారంభించారు. డీఎం మాట్లాడుతూ దైవదర్శనాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట–సురేంద్రపురి–బంగారు శివలింగం–స్వర్ణగిరి టెంపుల్ దర్శనానికి స్పెషల్ డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు డీఎం వివరించారు. పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.450 చార్జీ ఉంటుందని తెలిపారు. వివరాలకు 90634 03971, 99592 25929, 73828 50611, 63041 71291, 94946 37598లలో సంప్రదించాలని కోరారు.
ఆలయాల్లో ఆకస్మిక తనిఖీ
వేములవాడ: రాజన్న అనుబంధ బద్దిపోచమ్మ గుడి, భీమేశ్వర సదన్‌లను ఈవో రాధాభాయి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బద్దిపోచమ్మ ఆలయంలో వసతులు, కౌంటర్లు పరిశీలించారు. భీమేశ్వర సదన్‌లో ప్రైవేట్ వాహనాల పార్కింగ్, ప్రైవేట్ వ్యక్తుల అడ్డాపై ఆరా తీశారు. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు నిలిపితే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

టెన్త్ విద్యార్థులకు రేపు సైకిళ్ల పంపిణీ

టెన్త్ విద్యార్థులకు రేపు సైకిళ్ల పంపిణీ

టెన్త్ విద్యార్థులకు రేపు సైకిళ్ల పంపిణీ