
ఆస్పత్రికి వెళ్లేదెలా?
● బురదమయంగా రోడ్డు ● డ్రెయినేజీపై సిమెంట్‌బిల్ల కరువు ● పట్టించుకోని అధికారులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఆరోగ్య కేంద్రం అంటేనే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వస్తుంటారు. అయితే ఆస్పత్రిలోకి వెళ్లేందుకు సరైన రోడ్డు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే రోడ్డు చిరుజల్లులకే బురదమయంగా మారుతుంది. ఆస్పత్రి ముందు నుంచి వెళ్తున్న డ్రెయినేజీపై సిమెంట్ బిల్ల లేకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న రోడ్డు గుండా వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ముందు పెద్ద డ్రెయినేజీ అడ్డంగా ఉంది. దీనిని దాటడం అంత సులభమేమీ కాదు. పెద్ద మోరీ కావడంతో దాట లేక మహిళలు దూరమైనా తహసీల్ ఆఫీస్ పక్క నుంచి వెళ్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు రూ.38లక్షలతో కుమ్మరికుంట వరదనీరు వెళ్లేందుకు పెద్ద డ్రెయినేజీ నిర్మించారు. దానిపై కొన్నిచోట్ల సిమెంటు బిళ్లలు వేశారు. కానీ పల్లె దవాఖానా, వీవో భవనం, పీహెచ్‌సీ వద్ద సిమెంట్ బిళ్లలు వేయలేదు. దీంతో ఆయా ఆఫీసుల్లోకి వెళ్లేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు.
పేషెంట్లకు ఇబ్బందికరంగా ఉంది
ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. డ్రెయినేజీపై బిల్ల లేక చుట్టూ తిరిగి వస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రమాదాలు జరుగకముందే డ్రెయినేజీపై సిమెంట్ బిల్ల వేయాలి. – జీవనజ్యోతి, డాక్టర్

ఆస్పత్రికి వెళ్లేదెలా?